న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్దమైంది. రూ. 100, రూ. 10, రూ.5 పాత నోట్లకు ఈ ఏడాది మార్చి నెల లేదా ఏప్రిల్ నెల నుంచి మంగళం పాడేందుకు సిద్దమైంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా సర్కులేషన్‌లో ఉన్న పాత నోట్లను ఉప సంహరించుకోనున్నట్టు ఆర్బీఐ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ బి. మీనా తాజాగా మీడియా సమావేశంలో చెప్పుకొచ్చారు. డిస్ట్రిక్ లీడ్ బ్యాంకు జిల్లా పంచాయత్‌లోని నేత్రావతి హాల్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో మీనా పాల్గొని ప్రసంగించారు.

ఈ సందర్భంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. పాత నోట్లలో చాలా వరకు ఫేక్ కరెన్సీ కూడా చలామణీలో ఉన్నట్టు ఆర్బీఐ గుర్తించింది. ఈ నేపథ్యంలో పాత నోట్లను వెంటనే రద్దు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. నిజానికి రిజర్వ్ బ్యాంకు ఎప్పటి కప్పుడు పాత నోట్లను రద్దు చేస్తూనే ఉంటుంది. ఇంతకు ముందు కూడా అనేక పాత నోట్లు చలామణీలో ఉండేవి. ఆ నోట్లు పాతగా అయిపోయిన తరువాత అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు తిరిగి చివరకు బ్యాంకులకు చేరుకుంటాయి. బ్యాంకుల నుంచి నేరుగా రిజర్వ్ బ్యాంకుకు వెళ్లిపోతాయి.

రిజర్వ్ బ్యాంకు ఆ నోట్లను రద్దు చేసి వాటి స్థానంలో కొత్త నోట్లను ప్రింట్ చేస్తుంది. ఇక ఇదే కార్యక్రమంలో రూ. 10 కాయిన్ల గురించి కూడా ఆమె మాట్లాడారు. రూ. 10 కాయిన్లను విడుదల చేసి 15 ఏళ్లు గడుస్తున్నా అవి ఇప్పటికి చలామణిలోకి రావడం లేదన్న విషయాన్ని గుర్తు చేశారు. ప్రజలు రూ. 10 కాయిన్లను అంగీకరించేందుకు సిద్దంగా లేరని మీనా అన్నారు. బ్యాంకులు రూ. 10 కాయిన్లను ప్రమోట్ చేయడానికి వివిధ మార్గాలను అన్వేషించాలని బి. మీనా సూచించారు. రూ. 10 కాయిన్లు బ్యాంకుల్లోనే పేరుకుపోయాయని, దీని వల్ల రిజర్వ్ బ్యాంకుకు పెద్ద సమస్యగా మారిందని ఆమె తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: