
ఓ వైపు వైరస్ కేసులు పెరుగుతుండటంతో... తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో అన్ని రకాల ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలకు సెలవులను ప్రకటించారు. తెలంగాణలో ఈ నెల 30వ తేదీ వరకు స్కూల్స్ కు సెలవులు ఇచ్చేసింది ప్రభుత్వం. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం సెలవులు ఇచ్చేది లేదని విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తేల్చి చెప్పారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఎవరైనా పిల్లలు కొవిడ్ భారిన పడితే ఆ పాఠశాల మూసివేసి.. తర్వాత ప్రారంభిస్తామన్నారు. ప్రతి పాఠశాలలో కొవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటిస్తున్నామన్నారు విద్యా శాఖ మంత్రి. అయితే ఓ వైపు కేసుల సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతుండటంతో... విద్యార్థులను పాఠశాలకు పంపేందుకు తల్లిదండ్రులు భయపడుతున్నారు. ఇదే విషయాన్ని ఇప్పటికే అన్ని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలకు స్పష్టం చేశారు. కొంతమంది అయితే తమ పిల్లలను సోమవారం నుంచి బడికి పంపటం లేదు. దీంతో.. కొన్ని ప్రైవేటు విద్యా సంస్థలు మళ్లీ ఆన్ లైన్ బాట పడుతున్నాయి. ప్రభుత్వ సూచనలు అమలు చేస్తూనే... ఆన్ లైన్, ఆఫ్ లైన్ విధానంలో క్లాసులు కొనసాగించేందుకు రెడీ అయ్యాయి. తల్లిదండ్రులకు ఎలాంటి ఇబ్బంది లేకపోతే... బడికి పంపవచ్చని... లేదంటే ఆన్ లైన్ విధానంలో రెడీ అంటున్నాయి విద్యా సంస్థలు.