ఏ విషయాన్నైనా సరే ఉన్నది ఉన్నట్లు రిపోర్టు చేయటం నిఖార్సయిన జర్నలిజం చేయాల్సిన పని. కానీ ఉన్నది లేనట్లు, లేనిదాన్ని ఉన్నట్లు, జరగకపోయినా జరిగినట్లు అంటే విషయానికి తమకు కావాల్సినట్లుగా మసిపూసి జనాలకు చూపించటాన్నే ఎల్లో జర్నలిజం అంటారు. ఇపుడు ఏపీలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మెజారిటి మీడియా చేస్తున్నదిదే. అందుకనే జగన్  అండ్ కో ఈ మీడియాను ఎల్లోమీడియా అంటున్నది.





ఇంతకీ విషయం ఏమిటంటే 20వ తేదీన గన్నవరంలో టీడీపీ ఆఫీసు దగ్గర గొడవైంది. ఆ గొడవకు సంబంధించిన గొడవను పక్కనపెట్టేద్దాం.  ఆ తర్వాత జరిగిన ఘటనలపై ఎల్లోమీడియా వ్యవహరించిన విధానమే ఆశ్చర్యంగా ఉంది. దాడికి కారకుడని టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ను పోలీసులు అరెస్టు చేశారు. రాత్రంతా ఎక్కడెక్కడో తిప్ప చచ్చేట్లు కొట్టాడని ఆయన భార్య చందన, చంద్రబాబునాయుడు అండ్ కో గోలగోల చేశారు.





సరే పట్టాభిని మంగళవారం మధ్యాహ్నం పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. తన మొహానికి ముగ్గురు వ్యక్తులు టవల్ చుట్టేసి తోట్లవల్లూరు పోలీసుస్టేషన్లో  చచ్చేట్లు కొట్టారని పట్టాభి మీడియా ముందు ఆరోపించారు. ఇదే విషయాన్ని కోర్టులో జడ్జీతో కూడా చెప్పారు. బుధవారం ఎల్లోమీడియా బ్యానర్ గా పట్టాభికి చెందిన నాలుగు ఫొటోలు ప్రింట్ చేసి ‘పట్టాభినీ కొట్టారు’ అనే హెడ్డింగ్ తో పే...ద్ద కథనాన్ని అచ్చేసింది. ఇపుడీ ఫొటోల దగ్గరే ఎల్లోమీడియా దొరికిపోయింది.





ఎలాగంటే ఎల్లోమీడియా ప్రింట్ చేసిన ఫొటోలు 2021 ఫిబ్రవరివట. అప్పట్లో ఇంటిమీద దాడి జరిగినపుడు పట్టాభికి మోచేయి, మోకాలిపై దెబ్బలు తగిలాయట. అప్పట్లో పట్టాభి గ్రే కలర్ ప్యాంట్ వేసుకున్నాడు. మంగళవారం పట్టాభి కోర్టుకు వచ్చినపుడు బ్లూకలర్ జీన్స్ ప్యాంట్ వేసుకున్నాడు. అయితే దీన్ని గమనించకుండా ఎల్లోమీడియా గ్రే కలర్ ఫొటోలనే బ్యానర్ గా అచ్చేసి అడ్డంగా దొరికిపోయింది.





అప్పట్లో తనకు తగిలిన దెబ్బలను పట్టాభి మీడియాలో చూపించారు. అవే ఫొటోలను ఇపుడు ఎల్లోమీడియా బ్యానర్ కథనంలో వాడేసింది. దీంతోనే ఎల్లోమీడియా బరితెగింపు ఏమిటో అందరికీ అర్ధమైపోయింది. పైగా అరిచేతులు, అరికాళ్ళపై లాఠీలతో చచ్చేట్లు కొట్టారని చెప్పాడు. నిజంగానే అలా కొట్టుంటే మరుసటి రోజు మధ్యాహ్నమే వ్యాన్ దిగి చక్కగా నడుచుకుంటు కోర్టులోకి పట్టాభి వెళ్ళగలడా ? ఈ ఫొటోలు చూస్తేనే తెలిసిపోతోంది ఎల్లోమీడియా ఎంతగా బరితెగించిందో.

మరింత సమాచారం తెలుసుకోండి: