జనసేన అధినేత పవన్ కల్యాణ్ కెపాసిటి ఏమిటో తొందరలోనే తేలిపోతుంది. ఏ విధంగా తేలిపోతుందంటే ఎంఎల్సీ ఎన్నికల్లో ఓటర్లు వైసీపీకి వ్యతిరేకంగా ఓట్లేసి ఓడించాలని పిలుపిచ్చారు. విచిత్రం ఏమిటంటే పోటీచేసే అవకాశాన్ని వదిలేసి ఇపుడు వైసీపీని ఓడించాలని పిలుపివ్వటమే. శాసనమండలిలో భర్తీ కావాల్సిన ఐదు ఎంఎల్సీ స్ధానాలకు ఈనెల 13వ తేదీన పోలింగ్ జరగబోతున్న విషయం తెలిసిందే. ఇందులో మూడు ఉపాధ్యాయ, రెండు టీచర్ నియోజకవర్గాలున్నాయి.





ఈ ఎన్నికల్లో డైరెక్టుగా జనాలందరికీ ఎలాంటి సంబంధంలేదు. నిరుద్యోగులు, గ్రాడ్యుయేట్లు, ఉద్యోగులు, టీచర్లు మాత్రమే ఓట్లేయాల్సుంటుంది.  అంటే ప్రభుత్వం విషయంలో సమాజంలోని జనాల మనోభావాలు ఎలాగున్నాయి అని అంచనా వేసేందుకు ఈ ఎన్నికలు ఉపయోగపడతాయి. ఇంతటి కీలకమైన ఎన్నికల్లో ఐదుస్ధానాలను గెలుచుకోవాలని జగన్మోహన్ రెడ్డి పట్టుదలగా ఉన్నారు. ఇదే సమయంలో టీడీపీ కూడా పోటీలోకి దిగింది. అలాగే ఒకటిరెండు స్ధానాల్లో బీజేపీ కూడా పోటీచేస్తోంది.





కాబట్టి కీలకమైన ఈ ఎన్నికల్లో జనసేన కూడా దిగుంటే కత వేరుగా ఉండేది. ప్రజలంతా జగన్ పాలనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని పవన్ పదేపదే చెబుతున్న విషయం తెలిసిందే. పవన్ మాట నిజమే అయితే మరి ఎన్నికల్లో పోటీచేసి తమ అభ్యర్ధులను గెలిపించుకోవచ్చు కదా. కానీ అలా ఎందుకు చేయలేదంటే ఓట్లు చీలకుండా ఉండటం కోసమే. అంటే పరోక్షంగా టీడీపీకి సహకరించటమే టార్గెట్ గా పెట్టుకున్నారు. మరి మిత్రపక్షం బీజేపీ అభ్యర్ధుల పరిస్ధితి ఏమిటి ? అసలు పవన్ పిలుపుకు ఎంతమంది స్పందిస్తారనేది పెద్ద ప్రశ్న.





ఇక్కడే పవన్ కెపాసిటి ఏమిటో తేలిపోతుంది. టీడీపీకి అనుకూలంగా ఓట్లేయమని చెప్పలేరు. అలాగని బీజేపీకి ఓట్లేసి గెలిపించమనీ అడగటంలేదు.  ఇలాంటి మధ్యేమార్గమే పవన్ను దెబ్బతీయబోతోంది. వైసీపీకి వ్యతిరేకంగా ఓట్లేయమని చెబుతున్న పవన్ ఎవరికి ఓట్లేయాలో మాత్రం చెప్పలేకపోతున్నారు. ఈ కన్ఫ్యూజనే చివరకు పార్టీని దెబ్బకొట్టేయటం ఖాయం. పోలింగ్ దగ్గరకు వస్తున్న సమయంలో కూడా ఇంతటి అయోమయంలో ఉన్న పవన్ పిలుపును ఓటర్లు ఎంతవరకు పట్టించుకుంటారో ? వైసీపీకి వ్యతిరేకంగా పడిన ఓట్లన్నీ తమ వల్లే అని చెప్పుకోవటం ఒకటే పవన్ కు మిగిలింది.


మరింత సమాచారం తెలుసుకోండి: