ఎన్నికలు దగ్గరకు వస్తున్న నేపధ్యంలో జగన్మోహన్ రెడ్డి తన రూటు మార్చుకున్నట్లే  ఉన్నారు. జిల్లాల పర్యటనల సందర్భంగా ఈ విషయం అర్ధమవుతోంది. తాజాగా బందరు పర్యటనలో జరిగిన పరిణామాలతో ఈ విషయం స్పష్టమైంది. ప్రతిపక్షంలో ఉన్నపుడు పార్టీకి, నేతలకు సమయం కేటాయించినంతగా ముఖ్యమంత్రి హోదాలో ఉన్నపుడు కేటాయించలేరు. అయితే పార్టీని నిర్లక్ష్యంచేస్తే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. అందుకనే అవకాశమున్నంతలో ఇటు ప్రభుత్వం అటు పార్టీని బ్యాలెన్స్ చేసుకునేందుకు ప్రయత్నిస్తుంటారు.





బ్యాలెన్స్ కుదరనపుడు ఎన్నికల్లో దెబ్బపడిపోవటం ఖాయం. ఈ విషయాన్ని జగన్ ఏడాది ముందుగానే గ్రహించినట్లున్నారు. అందుకనే పర్యటనల సందర్భంగా నేతలతో మీటింగులకు కూడా ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇపుడు మచిలీపట్నం పర్యటనలో జరిగిందిదే. పోర్టు నిర్మాణ పనుల ప్రారంభం సందర్భంగా పూజలు, పైలాన్ ఆవిష్కరణ, వేదికమీద ప్రసంగాన్ని తొందరగానే ముగించారు. తర్వాత కలెక్టర్, మంత్రులు, ఎంఎల్ఏలతో మీటింగు అయిందనిపించేశారు.





దాదాపు గంటపాటు జిల్లాలోని ద్వితీయశ్రేణి నేతలతో సమావేశమయ్యారు. మండలాల్లో, నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్ లో బలమైన నేతలను పేరుపేరునా పలకరించి మాట్లాడారు. వాళ్ళు చెప్పిన సమస్యలను విని వాళ్ళకు కొన్ని హామీలిచ్చారు. కొన్నిసమస్యల పరిష్కారానికి  వెంటనే వాళ్ళముందే జిల్లా కలెక్టర్ కు ఆదేశాలిచ్చారు. జగన్ ఎప్పుడూ మంత్రులు, ఎంఎల్ఏలు, ఎంపీలతోనే మాట్లాడుతున్నారని తమకు సమయం కేటాయించటంలేదనే అసంతృప్తిగా ఉన్న నేతల సంఖ్య తక్కువేమీ కాదు.





రేపటి ఎన్నికల్లో పార్టీ మళ్ళీ గెలవాలంటే ద్వితీయశ్రేణి నేతలు పనిచేయకపోతే కష్టం. ఆ విషయం తెలుసుకాబట్టే జిల్లాల పర్యటనలో ద్వితీయశ్రేణి నేతలకు కూడా సమయిస్తున్నారు. కొన్ని జిల్లాల్లో కేవలం తానుమాత్రమే మాట్లాడి మీటింగును ముగించేస్తున్నారు. మిగిలిన సమయాన్ని ద్వితీయ శ్రేణి నేతలకు కేటాయిస్తున్నారు.  గడచిన మూడునెలలుగా జగన్ ఇద్దే పద్దతి అనుసరిస్తున్నారు. ఏ జిల్లాలో పర్యటించినా ద్వితీయశ్రేణినేతలను పిలిపించుకుని వాళ్ళతో కనీసం గంటసేపు మాట్లాడుతున్నారు. ద్వితీయశ్రేణి నేతలందరికీ సీఎంతో చెప్పి చేయించుకునే పనులుండవు. భుజంమీద చెయ్యేసి జగన్ దగ్గరకు తీసుకుంటేచాలు పొంగిపోతారు. ఇలాంటి వాళ్ళకి కావాల్సింది పదిమందిలో ఇమేజి మాత్రమే.  దాన్ని జగన్ గుర్తించే తన రూటును మార్చుకున్నారు. మరి జగన్ కొత్తరూటు రాబోయే ఎన్నికల్లో ఎంతవరకు రిజల్టు ఇస్తుందో చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: