ఆచరణకాని హామీలివ్వటంలో చంద్రబాబునాయుడు నెంబర్ 1 అని చెప్పాలి. ఇపుడు లోకేష్ కూడా అదే బాటలో నడుస్తున్నట్లున్నారు. వెనకాముందు ఆలోచించకుండా నోటికొచ్చినట్లుగా హామీలిచ్చేస్తున్నారు. కర్నూలు పాదయాత్రలో ఇచ్చిన రెండు హామీలు విచిత్రంగానే ఉన్నాయి. అవేమిటంటే మొదటిది ఇస్లామిక్ బ్యాంకు ఏర్పాటు చేస్తానని హామీ ఇవ్వటం. ఇక రెండోది హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని చెప్పటం. హామీలు ఎన్నయినా ఇవ్వచ్చు కానీ అవి ఆచరణ సాధ్యమేనా అని చూసుకోవాలి.





ఇచ్చే హామీలను తాము అమలుచేయగలమా లేదా అని చూసుకుంటే బాగుంటంది. ఇస్లామిక్ బ్యాంకు ఏర్పాటు అన్నది రాష్ట్రప్రభుత్వం పరిధిలో లేదని లోకేష్ కు తెలుసో తెలీదో. ఏ బ్యాంకు ఏర్పాటుచేయాలన్నా అందుకు అనుతించాల్సింది రిజర్వుబ్యాంకు ఆఫ్ ఇండియా. రిజర్వ్ బ్యాంక్ అంటేనే కేంద్రప్రభుత్వం అని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఒక బ్యాంకు ప్రారంభించాలంటే మూలధనం కింద వేలకోట్లరూపాయలను చూపించాలి. పైగా ఇస్లామిక్ బ్యాంక్ అంటే కేంద్రప్రభుత్వం అంత తొందరగా అనుమతులు ఇవ్వదు. కాబట్టి ఏ రకంగా చూసినా ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు కష్టమే.





ఇక హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామన్నారు. హైకోర్టు బెంచ్ ఏర్పాటు కూడా రాష్ట్రప్రభుత్వం పరిధిలో లేదు. అందుకు హైకోర్టు అంగీకరించాలి. హైకోర్టు అంగీకరించాలంటే సుప్రింకోర్టును సంప్రదించాల్సిందే. ఎందుకంటే బెంచ్ ఏర్పాటంటే మళ్ళీ జడ్జీలతో పాటు అవసరమైన సిబ్బందిని నియమించాల్సుంటంది. సిబ్బందిని హైకోర్టే నియమిస్తుంది కానీ  జడ్జీలను నియమించటం కొంచె కష్టమే.





అందుకనే సుప్రింకోర్టును సంప్రదించాల్సుంటంది. కాబట్టి లోకేష్ ఇచ్చిన రెండుహామీలు ఆచరణ సాధ్యమయ్యేట్లుగా లేదు. కర్నూలుకు హైకోర్టు తరలింపును అడ్డుకుంటు టీడీపీ నేతలు కోర్టులో కేసులు వేశారు. ఒకవైపు హైకోర్టు తరలింపుకు అడ్డుపడుతు మరోవైపు హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని చెబితే ఎంతమంది నమ్ముతారు ? చంద్రబాబు కూడా ఇలాగే అప్పటికప్పుడు నోటికేదొస్తే ఆ హామీలన్నింటినీ ఇచ్చేస్తారు. పోయిన ఎన్నికల్లో రైతుల రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ, నిరుద్యోగ భృతి లాంటి తప్పుడు హామీలిచ్చేసి గట్టిగా తగులుకున్నారు. ఇప్పటికీ అందులో నుండి బయటపడలేక నానా అవస్తలు పడుతున్నారు. ఇపుడు కొత్తగా లోకేష్ అదే బాటలో వెళుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: