నిజంగానే ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ  చంద్రబాబునాయుడు ధైర్యానికి మెచ్చుకోవాలి. తప్పుడు హామీలిస్తే జనాలు ఏమనుకుంటారో అనే జంకు కూడా లేకుండా నోటికొచ్చింది ఇచ్చేస్తారు. అధికారంలోకి వచ్చినప్పటి సంగతి కదా అప్పుడు చూసుకుందాములే అనుకున్నట్లున్నారు. దీనికి కారణం తన మేథస్సు మీద అతి నమ్మకమో లేకపోతే జనాల జ్ఞాపశక్తి మీద చిన్నచూపో తెలీదు. లేకపోతే మహానాడు వేదిక మీదనుండి ఇంత నిర్భయంగా ఇలాంటి హామీలను ఇవ్వగలరా ?





చంద్రబాబు కాబట్టే ధైర్యంగా ప్రకటించేశారు. ఈ హామీల్లో పక్కపార్టీల నుండి కాపీకొట్టినవే అనిపిస్తున్నాయి. ఇచ్చిన హామీల్లో మచ్చుకి ఆడబిడ్డనిధి పథకం కింద ఇంట్లో 18-59 ఏళ్ళ వయస్సును ఆడవాళ్ళకి నెలకు 1500 రూపాయలిస్తారట. ఎంతమంది ఆడవాళ్ళుంటే అంతమందికీ ఇస్తారట. తల్లికి వందనం పథకం కింద ఎంతమంది చదువుకునే  పిల్లలున్నా వాళ్ళ తల్లులకు రు. 15 వేల ప్రోత్సాహకమిస్తారట. దీపం పథకం కింద ఏడాదికి 3 సిలిండర్లు ఉచితమట. ఉచిత బస్సు ప్రయాణంలో భాగంగా మహిళలు జిల్లాలో ఎక్కడినుండి ఎక్కడికి తిరగాలన్నా పూర్తి ఉచితమట.





స్ధానిక అర్హత కింద ఇద్దరికంటే ఎక్కువ సంతానం ఉంటే స్ధానికసంస్ధల ఎన్నికల్లో పోటీకి అనర్హులు అనే నిబంధనను తొలగిస్తారట. యువగళం పథకంలో ఐదేళ్ళల్లో 20 లక్షల ఉద్యోగాలిస్తారట. ఉద్యోగం వచ్చేవరకు నిరుద్యోగులకు నెలకు రు. 3 వేల భృతి ఇస్తారట. అన్నదాత పథకం కింద ప్రతిరైతు సాయంకింద ఏడాదికి రు. 20 వేలిస్తారట. ఇంటింటికి కొళాయి పథకం కింద మంచినీరు తెచ్చుకునేందుకు మహిళలకు శ్రమలేకుండా ప్రతి ఇంటికి ఒక కొళాయి ఏర్పాటుచేస్తారట. ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం లాగే బీసీ రక్షణచట్టం తెస్తారట. పేదలను ధనికులను చేసేందుకు పూర్ టు రిచ్ అనే పథకం అమలుచేస్తరట.





ఇవి కొన్ని పథకాలు మాత్రమే ముందుముందు ఇంకా చాలా ప్రకటిస్తారట. ఇపుడు ప్రకటించిన పథకాల్లో కర్నాటక కాంగ్రెస్, వైసీపీ, తెలంగాణాలో బీఆర్ఎస్ పార్టీల హామీలను కాపీ కొట్టినట్లు అర్ధమైపోతోంది. 2014లో నిరుద్యోగ భృతిగా నెలకు వెయ్యిరూపాయలిస్తామని ఇవ్వలేక చేతులెత్తేశారు. అలాంటిది రేపు అధికారంలోకి వస్తే నెలకు రు. 3 వేలిస్తరట. రైతురుణమాఫీ అని చెప్పి రైతులను మోసం చేసిన చంద్రబాబు రేపు అధికారంలోకి రాగానే ఏడాదికి ప్రతిరైతుకు రు. 20 వేలిస్తారట.





డ్వాక్రా రుణమాఫీ అని తప్పుడు హామీలిచ్చిన చంద్రబాబు రేపు అధికారంలోకి రాగానే ప్రతి ఇంట్లో ఎంతమంది ఆడవాళ్ళుంటే అంతమందికీ నెలకు రు. 1500 ఇస్తానంటే ఎవరైనా నమ్ముతారా ? చదువుకున్న పిల్లలు ఎంతమందుంటే అంతమందికీ రు. 15 వేల చొప్పు ఇస్తానని చెప్పటం కూడా ఇలాంటిదే. 2014-19 మధ్య చంద్రబాబు హామీల అమలు చాలామందికి గుర్తుంది. వాటిని మరచిపోకముందే మళ్ళీ అంతకుమించిన హామీలివ్వటమే ఆశ్చర్యంగానే ఉంది.



మరింత సమాచారం తెలుసుకోండి: