పోలవరం ప్రాజెక్టు పనుల్లోని డొల్లతనం బయటపడుతోందా ? తాజా పరిణామాలను చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. పోలవరం ప్రాజెక్టులో కీలకమైన ఎడమవైపు  స్పిల్ వే రీటైనింగ్ వాల్ కుంగిపోయినట్లు సమాచారం. 500 మీటర్ల పొడవుతో దిగువ నుండి 26 మీటర్ల ఎత్తున ఈ గోడను కాంట్రాక్టు సంస్ధ నిర్మిస్తోంది. ఇపుడు పోలవరం ప్రాజెక్టు పనులను మేఘా ఇంజనీరింగ్ సంస్ధ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. గతంలో నవయుగ కంపెనీ నిర్మించిన డయాఫ్రం వాల్ కూడా దెబ్బతిన్న విషయం తెలిసిందే.





ఇలాంటి అవరోధాల వల్లే ప్రాజెక్టు నిర్మాణానికి అడ్డంకులుగా మారుతోంది. అప్పట్లో దెబ్బతిన్న డయాఫ్రం వాల్ నిర్మాణానికి సుమారు రు. 2 వేల కోట్లు ఖర్చవుతుందని నిపుణులు అంచనావేశారు. ఇపుడు కుంగిన స్పిల్ వే రీటైనింగ్ వాల్ పరిస్ధితి ఏమిటనేది ఇంకా తెలీదు. ఎడమవైపు వాల్ కుంగిందని అన్నారే కానీ ఏ మేరకు కుంగింది ? దీన్ని సరిచేయటం ఎలాగన్న విషయాలు మాత్రం ఇంకా తెలీలేదు. కుంగిన రీటైనింగ్ వాల్ వ్యవహారంపై పోలవరం అథారిటి అధికారులు, డ్యాం డిజైన్ అండ్ రివ్యూ ప్యానెల్ సభ్యులు అద్యయనంచేస్తున్నారు.





పోలవరం నుండి నీటిని విడుదలచేసినపుడు చాలా ఉధృతంగా బయటకు వస్తుంది. అంత ఉధృతిలో నీళ్ళు బయటకు వస్తే డ్యాంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలకు కూడా ప్రమాదమే. అందుకనే ప్రవాహ వేగాన్ని నియంత్రించేందుకు స్పీడు బ్రేకుల్లాగ ఉపయోగపడేదే స్పిల్ వే రీటైనింగ్ వాల్. నీటి ప్రవాహం మొత్తం ఈ రీటైనింగ్ వాల్ ను ఢీకొని మెల్లిగా దారి మళ్ళి డ్యాంలోపల నుండి బయటకు వస్తుంది. ఎంత వేగంతో నీటి ప్రవాహం వస్తుంది ? ఎంత వేగంగా వాల్ ను నీళ్ళు ఢీ కొడుతుందనేది నిపుణులు నిర్ధారించారు.





అంత వేగంగా వచ్చే నీటిని అడ్డుకునేందుకు తగ్గట్లుగానే నిపుణుల సూచనల ప్రకారమే రీటైనింగ్ వాల్ నిర్మాణం జరిగింది. అయితే కిందస్ధాయిలో వేసిన కంకర, ఇసుక, కాంక్రీట్ నీటికి దెబ్బతిన్నట్లు ప్రాధమికంగా గుర్తించారు. దీన్ని ఎలా సరిచేయాలన్నది నిపుణులే చెప్పాలి. ఇపుడా అద్యయనమే జరుగుతోంది. మరీ అధ్యయనం ఎప్పుడు పూర్తవుతోందో రిపేర్లు ఎప్పుడు మొదలుపెడతారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: