కోడలికి బుద్దిచెప్పి అత్త తెడ్డు నాకిందనే సామెత తెలుగులో చాలా పాపులర్. రామోజీరావు వ్యవహారం కూడా అచ్చంగా అలాగే ఉంది. అరెస్టుచేయటానికి వెళ్ళిన  సీబీఐ అధికారులను కర్నూలులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి మద్దతుదారులు అడ్డుకుంటున్నారంటు కొద్దిరోజులు ఆమధ్య తన మీడియాలో నానా రచ్చచేశారు. తన తల్లికి వైద్యవసరాల కోసం కర్నూలులోని ఆసుపత్రిలో అవినాష్ రెడ్డి ఉంచిన విషయం తెలిసిందే. అక్కడికి సీబీఐ అధికారులు కూడా వెళ్ళారు. దాంతో ఎంపీనీ సీబీఐ అరెస్టుచేయబోతోందని నానా గోలచేసింది ఎల్లోమీడియా.





అరెస్టుచేయాలని వెళ్ళినా చేయలేకపోయిందని ఎందుకంటే ఎంపీ మద్దతుదారులు సీబీఐని అడ్డుకున్నారంటు వార్తలురాసింది. తన మద్దతుదారులతో సీబీఐని ఎంపీ భయపెట్టారంటు  ప్రత్యేక కథనాలు రాసింది. ఏపీలో అరాచకపాలన నడుస్తోందనటానికి ఇంతకన్నా నిదర్శనం ఏమికావాలని నిలదీసింది. నిజానికి ఎంపీని అరెస్టుచేయటానికే తాము కర్నూలుకు వచ్చామని అప్పట్లో సీబీఐ ప్రకటించలేదు. కర్నూలుకు చేరుకున్న సీబీఐ అధికారులు ఎస్పీతో మాట్లాడారంతే.





సరే రామోజీ లెక్కల ప్రకారమే సీబీఐని ఎంపీ మద్దతుదారులు అడ్డుకున్నారనే అనుకుందాం. మద్దతుదారులు చేసింది తప్పనే అనుకుందాం. మరి విచారణకు వచ్చిన సీఐడీ అధికారులను మార్గదర్శి సిబ్బందిపేరుతో రామోజీ చేయించేందేమిటి ? చీటింగ్ కేసులో  మార్గదర్శి ఎండీ శైలజను విచారించేందుకు  ఇంటికి వచ్చిన సీఐడీ అధికారులను మార్గదర్శి సిబ్బంది లోపలకు అనుమతించలేదు. ఎందుకంటే వీరితో పాటు డైరెక్టరేట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు ఉండటమే. డీఆర్ఐ అధికారులను లోపలకు వెళ్ళనిచ్చేదిలేదని మార్గదర్శి సిబ్బంది పెద్ద హంగామానే చెశారు. మార్గదర్శి చీటింగ్ కేసు విచారణకు డీఆర్ఐ అధికారులకు సంబంధం ఏమిటని నిలదీయటమే విచిత్రంగా ఉంది.





విచారణకు వచ్చిన వారిలో సీఐడీతో పాటు డీఆర్ఐ అధికారులున్నారన్న విషయం మార్గదర్శి సిబ్బందికి ఎలా తెలుసు. రామోజీయే ముందుగా ఈ విషయాన్ని కనుక్కుని తన మనుషులతో ఇంట్లోకి విచారణ అధికారులను రాకుండా అడ్డుకున్నట్లు తెలిసిపోతోంది. విచారణ అధికారులకు మార్గదర్శి సిబ్బందికి రోడ్డుపైన ఇంటిముందే పెద్ద వాగ్వాదం జరిగింది. చాలాసేపు వాగ్వాదం  జరిగిన తర్వాత  ఇంట్లోనుండి ఆదేశాలు రాగానే  మార్గదర్శి సిబ్బంది వెనక్కుతగ్గారు. అప్పుడు అధికారులందరు రామోజీ ఇంట్లోకి వెళ్ళారు. శైలజను అరెస్టుచేస్తారనే ప్రచారం అందరికీ తెలిసిందే. అరెస్టుకు భయపడే రామోజీ, శైలజ ఇంటిముందు పెద్ద డ్రామా ఆడించినట్లు అర్ధమవుతోంది. అరెస్టు చేయటంలేదు అని నిర్ధారణ చేసుకున్న తర్వాతే సీఐడీ అధికారులను లోపలకు అనుమతించినట్లున్నారు. అంటే అప్పట్లో అవినాష్ పైన ఎలాంటి వార్తలు రాశారో ఇపుడు స్వయంగా రామోజీ కూడా అదే చేశారు.  పైగా డీఆర్ఐ అధికారులను లోపలకు వెళ్ళకుండా అడ్డుకున్న విషయాన్ని ఘనతగా రామోజీ తన మీడియాలో రాసుకోవటమే విచిత్రం.

మరింత సమాచారం తెలుసుకోండి: