
తిరుమల తిరుపతి దేవస్థానం తన అధీనంలోని దేవాలయాల్లో వర్చువల్ సేవలను క్రమంగా ప్రవేశపెడుతోంది. ఇప్పటికే తిరవలలో కొలువైయున్న గోవిందనామాల వానికి పలు సేవలు వర్చువల్ గా జరుగుతున్న విషయం మనకు తెలిసిందే. ఈ కోవలో మరో ఆలయంలోనూ వర్చువల్ సేవలు ప్రవేశ పెట్టింది తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి. ఆ దేవాలయం ఎక్కడో తెలుసా ?
శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ముఖ్య పర్వదినాల్లో నిర్వహించే కల్యాణోత్సవాన్ని వర్చువల్ సేవగా నిర్వహించాలని టిటిడి నిర్ణయించింది. భక్తులు ఆన్‌లైన్ ద్వారా కల్యాణోత్సవం సేవా టికెట్లు పొందాల్సి ఉంటుంది. ఫిబ్రవరి 5న వసంత పంచమి సందర్భంగా వర్చువల్ కల్యాణోత్సవం సేవ ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 12న ఏకాదశి, ఏప్రిల్ 2న ఉగాది, ఏప్రిల్ 16న చైత్ర పౌర్ణిమ, మే 21న శ్రవణా నక్షత్రం సందర్భంగా ఈ సేవ నిర్వహిస్తారు. అదేవిధంగా, జూన్ 11న ద్వాదశి, జూన్ 18న శ్రవణా నక్షత్రం, జూన్ 25న ద్వాదశి, ఆగస్టు 20న రోహిణీ నక్షత్రం, సెప్టెంబరు 10న పౌర్ణమి, అక్టోబరు 22న, నవంబరు 5న ద్వాదశి సందర్భంగా వర్చువల్ కల్యాణోత్సవం సేవ నిర్వహిస్తారు.
