
ఇంతకీ అసలేమైందంటే.. ఒడిశాలోని పూరీ జగన్నాథుడిని ఆ రాష్ట్ర వాసులు ఎంత భక్తిగా ఆరాధిస్తారో తెలిసిందే. అయితే... ఒడిశా కల్చర్‌ను దేశానికి చాటాలన్న ఉద్దేశ్యంతో నెస్లే సంస్థ కిట్ కాట్’ చాక్లెట్ పర్‌పై జగన్నాథస్వామితో పాటు బలభద్ర, సుభద్ర మాత చిత్రాలను ప్రింట్ చేసింది.
ఇలా గతంలోనూ నెస్లే చేసినా.. దేవుళ్ల బొమ్మలు మాత్రం ప్రింట్ చేయలేదు. ఇలా చేయడం ద్వారా పూరి జగన్నాథుని దేశానికి పరిచయం చేద్దామన్నది తమ ఉద్దేశ్యంగా ఆ కంపెనీ చెబుతుంది.
అయితే.. చాక్లెట్ కవర్‌పై దేవుళ్ల బొమ్మలు ముద్రించడంపై నెటిజన్ల నుంచి భారీగా విమర్శలు వచ్చాయి. బొమ్మ అభ్యంతరకరంగా లేకపోయినా.. చాకెట్లు తిన్న తర్వాత వాటిని ఎక్కడపడితే అక్కడ పడేస్తారని.. అది తమ మత విశ్వాసాలకు ఇబ్బంది కలిగించేలా ఉందని విమర్శించారు. ఇలా నెస్లె కంపెనీపై సామాజిక మాధ్యమాల వేదికగా జోరుగా విమర్శలు వచ్చాయి. దేవుళ్ల చిత్రాల రేపర్లను రోడ్లు, చెత్త బుట్టలు, మురికి కాలువల్లో పడేస్తారని ఆందోళన వ్యక్తం చేశారు.
చాక్లెట్ కవర్లపై దేవుళ్ల బొమ్మల ముద్రణను ఆపేయాలని నెటిజన్లు డిమాండ్ చేశారు. ఈ విమర్శలతో నెస్లే సంస్థ వెంటనే స్పందించింది. కళను, కళాకారులను ప్రోత్సహించాలనే ఇలా చేశామని వివరణ ఇచ్చింది. అయినా.. ఇది చాలా సున్నితమైన అంశమని.. దీని ద్వారా ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే క్షమాపణ చెబుతున్నామని ప్రకటించింది. వెంటనే ఆ చాక్లెట్లను మార్కెట్ నుంచి వెనక్కి రప్పిస్తామని ప్రకటించింది.