
ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ (WTC) 2025 ఫైనల్‌లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్ల మధ్య పోరాటం కొనసాగుతోంది. లండన్‌లోని లార్డ్స్ క్రికెట్ మైదానం వేదికగా ఈ మ్యాచ్ జరుగుతోంది. తొలి రోజు ఆట ఆసక్తికర మలుపులతో సాగింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా 56.4 ఓవర్లలో 212 పరుగులకే ఆలౌటైంది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా 22 ఓవర్లలో 43 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉంది. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ లో స్టీవ్ స్మిత్ (66), బో వెబ్‌స్టర్ (72) పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడారు. మరోవైపు రబడ (5 వికెట్లు), జాన్సెన్ (3 వికెట్లు) తీసి ఆస్ట్రేలియాను దెబ్బ తీశారు. ఇక ఆ తరవాత బ్యాటింగ్ వచ్చిన దక్షిణాఫ్రికా ఆదిలోనే చతికల పడింది.
మొదటిరోజు ముగిసే సమయానికి 22 ఓవర్లు ఆడిన దక్షిణాఫ్రికా 43/4 తో నిలిచింది. మిచెల్ స్టార్క్ 2 వికెట్లు, హజల్వుడ్, కమ్మిన్స్ చెరో వికెట్ తో దక్షిణాఫ్రికా బ్యాటర్లకు చుక్కలు చూపించారు. దీనితో దక్షిణాఫ్రికా ఇంకా 169 పరుగులు వెనుకంజలో ఉంది. ఇక మాస్క్ పరిస్థితి ఇలా ఉండగా ఆస్ట్రేలియా స్టీవ్ స్మిత్ రికార్డు సృష్టించాడు. మరి ఆ విశేషాలేంటో చూద్దమా..
ఈ మ్యాచ్‌లో 66 పరుగులతో రాణించిన స్టీవ్ స్మిత్, లార్డ్స్ మైదానంలో టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన విదేశీ బ్యాటర్‌గా నిలిచాడు. ఇప్పటి వరకు ఈ గౌరవం ఆసీస్ దిగ్గజం వారెన్ బార్డ్స్లీ (575 పరుగులు) పేరు మీద ఉండగా, ఇప్పుడు స్మిత్ తన మొత్తం పరుగుల సంఖ్యను 591కి చేరుకొని మొదటి స్థానంలోకి ఎగబాకాడు. స్మిత్ 2015లో ఇంగ్లండ్‌పై లార్డ్స్‌లో డబుల్ సెంచరీ (215 పరుగులు) నమోదు చేశాడు. అతని స్థిరమైన ఆటతీరుతో లార్డ్స్‌లో అతని పేరు చిరస్థాయిగా నిలిచిపోయింది.
లార్డ్స్ టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన విదేశీ ఆటగాళ్ల జాబితాలో ఆస్ట్రేలియా బ్యాటింగ్ దిగ్గజం స్టీవ్ స్మిత్ అగ్రస్థానంలో ఉన్నాడు. లార్డ్స్ మైదానంలో టెస్టు క్రికెట్‌లో స్మిత్ ఇప్పటి వరకు 591 పరుగులు సాధించాడు. అతని తర్వాత స్థానంలో మరో ఆస్ట్రేలియా క్రికెటర్ వారెన్ బార్డ్స్లీ ఉన్నారు. ఆయన లార్డ్స్‌లో 575 పరుగులు చేశారు. మూడో స్థానంలో విండీస్ లెజెండ్ గ్యారీఫీల్డ్ సోబర్స్ ఉన్నారు. ఆయన 571 పరుగులు చేశారు.
ఈ జాబితాలో క్రికెట్ చరిత్రలో గొప్ప ఆటగాడిగా పేరు పొందిన డాన్ బ్రాడ్‌మన్ కూడా ఉన్నారు. బ్రాడ్‌మన్ లార్డ్స్‌లో 551 పరుగులు సాధించారు. పాత తరం విండీస్ స్టార్ శివ్‌నారాయణ్ చందర్‌పాల్ కూడా 512 పరుగులతో ఈ జాబితాలో స్థానం పొందారు. భారత్‌కు చెందిన మాజీ కెప్టెన్ దిలీప్ వెంగ్‌సర్కార్ 508 పరుగులతో మరో మైలురాయిని అందుకున్నారు. మరో ఆసీస్ దిగ్గజం అలెన్ బోర్డర్ 503 పరుగులతో ఈ జాబితాలో ఉన్నారు. ఈ రికార్డుతో పాటు మ్యాచ్‌లో మొదటి రోజే స్మిత్ కీలక ఇన్నింగ్స్ ఆడుతూ ఆసీస్‌కు గౌరవప్రదమైన స్కోర్ అందించాడు. కానీ సౌతాఫ్రికా కూడా తన టాప్ ఆర్డర్‌ను చేజార్చుకుని తీవ్ర ఒత్తిడిలో పడింది. రెండో రోజు ఆట ఎటు సాగుతుందో అన్న ఉత్కంఠకరమైన పరిస్థితి నెలకొంది.