
చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న సినిమాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. అయితే అవి ఎంతలా సక్సెస్ అవుతున్నాయో.. అంతలా వివాదాస్పదం కూడా అవుతున్నాయి. తాజాగా అర్జున్‌కపూర్ నటించిన పానిపట్ సినిమాను కూడా అలాంటి కష్టాలే చుట్టుముట్టాయి.
ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు హిస్టారికల్ మూవీస్ హవా నడుస్తోంది. అయితే ఆ సినిమాల పట్ల కొన్ని వర్గాలు అభ్యంతరాలు తెలియజేస్తుండటంతో ఇబ్బందులు తప్పడం లేదు. ఇప్పుడు అర్జున్ కపూర్ నటించిన పానిపట్ సినిమా కూడా అలాంటి వివాదాల్లోనే చిక్కుకుంది. సినిమాపై రాజస్థాన్‌కు చెందిన జాట్ వర్గీయులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. వారికి ఆ రాష్ట్ర మంత్రి కూడా మద్ధతు తెలుపుతున్నారు.
మరాఠాలకు, ఆప్ఘన్ సైన్యాధిపతి అహ్మద్ షా అబ్దాలికి మధ్య 1761లో జరిగిన మూడో పానిపట్ యుద్ధం ప్రధానాంశంగా డైరెక్టర్ అశుతోష్ గోవరికర్ ఈ సినిమాను తెరకెక్కించారు. డిసెంబర్ 6న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ రాబడుతోంది. అయితే ఇంతలోనే సినిమా నిలిపివేయాలంటూ పలుచోట్ల జాట్ వర్గీయులు నిరసనలు చేపట్టారు. సినిమా ప్రదర్శనను నిలిపివేయకపోతే శాంతి భద్రతల సమస్యలు తలెత్తుతాయని రాష్ట్ర మంత్రి విశ్వేంద్ర సింగ్ హెచ్చరించారు. దీంతో జైపూర్ లోని పలు థియేటర్లలో సినిమా ప్రదర్శనను అర్ధాంతరంగా నిలిపివేశారు.
అయితే ఈ సినిమాను రాజవంశీకులు వ్యతిరేకించడానికి కారణం.. తెరపై వారి పూర్వీకుడు భరత్పూర్ మహారాజు సూరజ్‌మల్‌ను తక్కువ చేసి చూపడమేనట. పానిపట్ యుద్ధం ముగిసి తిరిగొచ్చేటప్పుడు.. మరాఠా సైనికులకు సూరజ్మల్ సహకరించలేదన్నట్టుగా సినిమాలో చూపించారనీ, అది అసత్యమని విశ్వేంద్రసింగ్ సహా.. జాట్ వర్గీయులంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మహారాజు సూరజ్ మల్కు సంబంధించిన చారిత్రక వాస్తవాలను.. సినిమాలో తప్పుగా చూపించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. హర్యానా, రాజస్థాన్ సహా ఉత్తరభారతదేశంలోని పలు రాష్ట్రాల్లో వ్యతిరేకత వస్తోంది. రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే కూడా సినిమాపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆత్మ గౌరవం కలిగిన గొప్పరాజు సూరజ్ మల్ ను అవమానించడాన్ని ఖండిస్తున్నట్టు.. ట్విట్టర్ వేదికగా స్పందించారు. అర్జున్ కపూర్, సంజయ్ దత్, క్రితీసనన్ కీలక పాత్రలు పోషించిన పానిపట్ సినిమా... షూటింగ్ మొదలైనప్పటి నుంచి మంచి క్రేజ్‌ను సంపాదించుకుంది. మరాఠా యోధుడు సదాశివరావ్ పాత్రలో అర్జున్ కపూర్, ఆయన భార్య పార్వతి భాయిగా క్రితీసనన్ నటించగా.. ఆప్ఘన్ సైన్యాధిపతి అహ్మద్ షా అబ్దలీ పాత్రలో సంజయ్ దత్ నటించాడు. భారీ అంచనాల నడుమ రిలీజైన ఈ సినిమా.. మంచి టాక్‌నే తెచ్చుకుంది. అయితే సడెన్ గా ఈ కొత్త వివాదం సినిమాను చుట్టుముట్టడం కలవరపెడుతున్నా... ఇలాంటివి సినిమా హైప్ ను మరింత పెంచుతాయనే అభిప్రాయమూ వ్యక్తమవుతోంది.