చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్.. తెలుగు సినిమా ఇండస్ట్రీకి వీరిని ఫోర్ పిల్లర్స్‌గా చెబుతారు. అయితే ప్రస్తుతం ఈ నలుగురు హీరోల వయసు కూడా 60 దాటేసింది. ప్రస్తుతం వీరి పిల్లల జెనరేషన్ వచ్చేసింది. ఇప్పటికే చిరంజీవి తనయుడు రామ్ చరణ్, నాగార్జున ఇద్దరు పిల్లలు నాగ చైతన్య, అక్కినేని అఖిల్, వెంకటేష్ కుటుంబం నుంచి రానా దగ్గుబాటి తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నారు. బాలకృష్ణ కుమారుడు నందమూరి మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ మాత్రం ఇప్పటి వరకు జరగలేదు. ఎప్పటికప్పుడు మోక్షజ్ఞ ఎంట్రీపై వార్తలు వస్తున్నాయే కాని ఆచరణలో మాత్రం అవి జరగడం లేదు. మరోపక్క నందమూరి అభిమానులు కూడా మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ కోసం ఎంతగానో వెయిట్ చేస్తున్నారు.

అయితే  ఇప్పుడు మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీపై సోషల్ మీడియాపై మళ్లీ చర్చ మొదలైంది. ఈ ఏడాది బాలయ్య పుట్టిన రోజు జూన్ 10వ తేదీన మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ ఖాయమని చర్చ సాగుతోంది. ఇప్పటికే చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ కూడా పూర్తి అయిందని, డైరెక్టర్ కూడా ఫైనల్ అయిపోయారనే టాక్ నడుస్తోంది. మొదటి నుంచి కూడా మోక్షజ్ఞను దర్శకుడు బోయపాటి శ్రీను ఇండస్ట్రీకి పరిచయం చేసే అవకాశాలున్నాయని చెబుతూ వచ్చారు. అయితే ప్రస్తుతం వినిపిస్తున్న వార్తల ప్రకారం.. డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ మోక్షజ్ఞ మొదటి చిత్రానికి దర్శకత్వం వహించనున్నారని తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ మొదటి సినిమా చిరుతకు పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించి రామ్ చరణ్‌ను ఇండస్ట్రీకి పరిచయం చేశారు.

ఇప్పుడు నందమూరి బాలకృష్ణ కొడుకును కూడా ఆయనే పరిచయం చేయనున్నారని టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం పూరీ జగన్నాథ్ విజయ్ దేవరకొండతో లైగర్ చిత్రాన్ని చేస్తున్నారు. ఈ చిత్రం పూర్తికాగానే పూరీ జగన్నాథ్ బాలయ్య కొడుకి స్క్రిప్ట్ పనుల్లో బిజీ కానున్నారని సోషల్ మీడియాలో చెప్పుకుంటున్నారు. పూరీ జగన్నాథ్ మోక్షజ్ఞ కోసం పవర్ ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేసి బాలయ్యకు వినిపించగా, ఆయనకు ఈ స్క్రిప్ట్ తెగ నచ్చేసిందని, వెంటనే ఓకే చెప్పేశారని సమాచారం. అంతేకాకుండా మొదటి చిత్రాన్నే పాన్ ఇండియా లెవల్లో తీసేందుకు పూరీ జగన్నాథ్ సన్నాహాలు చేస్తున్నారని అంటున్నారు. మరి ఈ వార్తల్లో ఎంత నిజం తెలియాలంటూ మరి కొద్ది రోజులు వేచి చూడక తప్పదు.

మరింత సమాచారం తెలుసుకోండి: