హైదరాబాద్: తెలంగాణ రాజకీయాలు ఎప్పుడు ఏ విధంగా మారుతాయో ఎవరికీ అర్థం కాకుండా ఉంది. తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ అయినప్పటికి.. 2014లో ఆ పార్టీ అధికారంలోకి రాలేకపోయింది. టీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఆ తరువాత తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మరింత బలహీనపడుతూ వచ్చింది. కాంగ్రెస్ పార్టీ బలహీన పడిందని అనడం కంటే.. సీఎం కేసీఆర్ కాంగ్రెస్ పార్టీని బలహీన పరిచారని అనాలి. అయితే ఒక పార్టీని బలహీన పరిస్తే మరో పార్టీ బలం పుంజుకుంటుందన్న విషయాన్ని సీఎం కేసీఆర్ మర్చిపోయారు. ఇదే ఆయనకు పెద్ద దెబ్బగా మారింది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో బలహీన పడేకొద్దీ రాష్ట్రంలో బీజేపీ పుంజుకోవడం మొదలైంది.

గత లోక్ సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి పెద్ద షాక్ ఇచ్చింది. లోక్ సభ ఎన్నికల తర్వాత బీజేపీ హవా రాష్ట్రంలో కొనసాగదని కేసీఆర్ లైట్ తీసుకున్నారు. కానీ.. దుబ్బాక ఉపఎన్నికలో గెలిచి కేసీఆర్‌కు కోలుకోలేని దెబ్బ కొట్టింది. దుబ్బాక విజయం తర్వాత రాష్ట్రంలో టీఆర్ఎస్‌కు ప్రత్యామ్మాయం బీజేపీనే అనే భావన ప్రజల్లో ఏర్పడింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సులభంగా మెజార్టీ సంపాదించుకోవాల్సిన టీఆర్ఎస్ ఎంతో కష్టపడాల్సి వచ్చింది. హైదరాబాద్‌లోని ప్రతి గల్లీ తిరిగినప్పటికి టీఆర్ఎస్ పార్టీ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మెజారిటీ సంపాదించుకోలేకపోయింది. గతంలో ఎన్నడూ లేని విధంగా బీజేపీ దాదాపు 50 స్థానాల్లో గెలుపొందింది. దీంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే లక్ష్యంగా బీజేపీ ముందుకు వెళ్తోంది. ఇక మరికొద్ది రోజుల్లో నాగార్జున సాగర్ ఉప ఎన్నికలు జరగబోతున్నాయి.

ఈ ఉప ఎన్నికల్లో ఎలానైనా గెలవాలని కేసీఆర్ పట్టుదలతో ఉన్నారు. మరోపక్క బీజేపీ సాగర్ సీటును కైవసం చేసుకుని రాష్ట్ర ప్రజలు తమవైపే ఉన్నారని నిరూపించుకోవాలని చూస్తున్నారు. ఇందులో భాగంగానే నాగార్జున సాగర్‌ బరిలో విజయ శాంతిని పెట్టాలని బీజేపీ చూస్తోంది. బీజేపీ నాయకత్వం కూడా ఆమె అయితే విజయం తప్పకుండా బీజేపీకే వరిస్తుందని భావిస్తోందట. కేసీఆర్‌ ప్రభుత్వంపై విజయ శాంతి విరుచుకు పడుతున్న తీరు బీజేపీకి ఎంతో కలిసొస్తుందని బీజేపీ నాయకులు కూడా అధిష్టానానికి చెప్పినట్టు సమాచారం. గత ఏడాది డిసెంబర్ ఏడో తేదీన విజయశాంతి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. బీజేపీని రాష్ట్రంలో అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తామని ఆమె చెప్పారు. నాగార్జున సాగర్ బరిలో అధిష్టానం నిలబడమని చెబితే విజయశాంతి కూడా పోటీ చేసేందుకు సిద్దంగా ఉన్నట్టు తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: