
నిజానికి హుజురాబాద్ ఉపఎన్నికలో గెలుపు కోసం అధికార టీఆర్ఎస్ పార్టీ సామ, దాన, భేద, దండోపాయాలను ప్రయోగించింది. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ఓటుకు రూ.6 వేలు నుంచి రూ.10 వేలు వరకు డబ్బు పంపిణీ చేసిందన్న ఆరోపణలు బాహాటంగానే వినిపించాయి. అయినప్పటికీ అవేవీ ఈ ఎన్నికల్లో ప్రభావం చూపలేకపోయాయి. అయితే టీఆర్ఎస్ ఓటమికి పలు కారణాలను పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా దళిత బంధు పథకంలో గందరగోళం నెలకొంది. పథకం అమలులో భాగంగా కొంతమందికి వచ్చిన డబ్బులు వెనక్కి వెళ్లడం వంటి అంశాలు టీఆర్ఎస్‌కు ప్రతిబంధంగా మారాయి. తమ ఖాతాల్లో పది లక్షల రూపాయలు వేస్తే.. కనీసం పది రూపాయలు తీసుకోవడానికి లేకుండా ఫ్రీజ్ చేశారనీ, అందులో కనీసం లక్ష రూపాయలైనా ఇవ్వాలని కొందరు లబ్ధిదారులు అడిగినప్పటికీ లాభం లేకపోయిందని టాక్. ఈ పరిణామం అసంతృప్తిగా మారి టీఆర్ఎస్ ఓటమికి ముఖ్య కారణమైందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
వాస్తవానికి హుజురాబాద్ నియోజకవర్గంలో ఈటల రాజేందర్‌కు బాగా పట్టుంది. దీంతో ఈటల ఇలాకాలో టీఆర్ఎస్ గెలుపు అంత సులభం కాదని భావించిన సీఎం కేసీఆర్.. నియోజకవర్గంలో ఎక్కువగా ఉన్న దళిత ఓటర్లను ఆకర్షించేందుకే దళిత బంధు పథకం అస్త్రాన్ని ప్రయోగించారన్న విశ్లేషణలు జోరుగానే సాగాయి. అయితే ఉపఎన్నికలో దళిత బంధు పథకం లబ్ధిదారులే టీఆర్ఎస్‌కు షాక్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే- ళిత బంధు పథకం అమలు కోసం శాలపల్లిని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. అక్కడ సీఎం కేసీఆర్ సభ కూడా ఏర్పాటు చేశారు. అయినప్పటికీ శాలపల్లిలో బీజేపీకి అత్యధిక ఓట్లు లభించడంతో.. అక్కడ కేసీఆర్ సర్కారు ప్రయోగించిన దళిత బంధు అస్త్రం ప్రభావం కనిపించలేదన్న చర్చ జరుగుతోంది.