
కాంగ్రెస్, పీడీపీలకు లభించిన ఓట్ల కన్నా ఎక్కువ ఓట్లు స్వతంత్ర అభ్యర్థులకు వచ్చాయన్నారు జమ్మూ-కశ్మీరు డీడీసీ ఎన్నికలకు బీజేపీ ఇన్‌ఛార్జి అనురాగ్ ఠాకూర్. జాతీయ పతాకాన్ని ఎగురవేసేందుకు తిరస్కరించిన మెహబూబా ముఫ్తీ పార్టీకి ప్రజలు బుద్ది చెప్పారన్నారు. మోడీపై ప్రజల్లో ఉన్న నమ్మకం వల్లనే కశ్మీరు లోయలో బీజేపీ మూడు స్థానాలను గెలుచుకోలిగిందని చెప్పారు.
జిల్లా అభివృద్ధి మండళ్ల ఎన్నికల ఫలితాలు బీజేపీకి కనువిప్పులాంటివన్నారు నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా . స్థానిక సంస్థల ఎన్నికలు గుప్కార్ కూటమిని ప్రోత్సహించే విధంగా ఉన్నాయి. 370 రద్దు తర్వాత బీజేపీ ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ప్రజలు ఎన్నికల ద్వారా తీర్పునిచ్చారు. ప్రజాస్వామ్యాన్ని విశ్వసించే వారు ప్రజలిచ్చిన తీర్పును కాస్త ఆలకించాలని బీజేపీపై వ్యంగ్యాస్త్రాలు విసిరారు ఒమర్ అబ్దుల్లా.
జమ్మూ కాశ్మీర్‌లో మొత్తం 280 జిల్లా అభివృద్ధి మండళ్లకు జరిగిన ఎన్నికల్లో గుప్కార్ కూటమి 117, బీజేపీ 74 స్థానాలను గెలుచుకున్నాయి. కూటమిలో నేషనల్ కాన్ఫరెన్స్ 67, జమ్మూకశ్మీర్ పీడీపీ 27 సీట్లు గెలుచుకున్నాయి. కాంగ్రెస్ 26, అప్నీ పార్టీ 12 స్వతంత్రులు 49 స్థానాలను గెలుచుకున్నారు. ఎన్నికల్లో బీజేపీ 38.74శాతం ఓట్లను సాధించింది. గుప్కార్ కూటమికి 32.96శాతం ఓట్లు దక్కాయి. బీజేపీకి 4,87,364 ఓట్లు రాగా.. ఎన్‌సీ, పీడీపీ, కాంగ్రెస్ కలిసి 4.77లక్షల ఓట్లు మాత్రమే వచ్చాయి. ఎన్నికల్లో 50 శాతానికి పైగా ప్రజలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. కాశ్మీర్‌లో బీజేపీకి సీట్లు దక్కడం ఇదే తొలిసారి.