
నిండు కుండను తలపిస్తున్న రాయల చెరువుకు గండి ముప్పు పొంచి ఉంది. చెరువు కట్ట బలహీనంగా మారుతూ హెచ్చరికలు జారీ చేస్తుంది. ఇప్పటికే అధికార యంత్రాంగం అప్రమత్తమై కట్ట పటిష్టతకు కృషి చేస్తుంది. కలెక్టర్ హరినారాయణన్, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ప్రత్యేకాధికారి ప్రద్యుమ్న, తిరుపతి అర్బన్ ఎస్పీ వెంకట అప్పలనాయుడు, ఎంపీపీ చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి చెరువును పరిశీలించారు. విపత్కర పరిస్థితులను ఎదుర్కునేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు హెలికాప్టర్‌ను కూడా సిద్ధం చేసి ఉంచారు.
దాదాపు 20 గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. తిరుచానూరులోని పద్మావతి నిలయంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలో దాదాపు 2వేల కుటుంబాలకు వసతి, భోజన సదుపాయం కల్పించినట్టు ఏపీ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వెల్లడించారు. అదేవిదంగా రామాపురంలోని వెరిటాస్ సైనిక్ స్కూలు, గంగిరెడ్డిపల్లెలోని ఏఈఆర్ ఎంబీఏ కళాశాల, కమ్మకండ్రిగ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సైతం పునరావాస శిబిరాలను ఏర్పాటు చేసినట్టు వివరించారు. ఈ తరుణంలో సమీప గ్రామాల ప్రజలు వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని ప్రభుత్వం విప్ చెవిరెడ్డి సూచించారు. ప్రజలు కొండలు, గుట్టల్లో తలదాచుకొని ఇబ్బంది పడకూడదని.. పునరావాస కేంద్రాల వద్దకు వెళ్లాలని సూచించారు. ఆదివారం అధికారులతో సమన్వయం చేసుకుంటూ రాత్రి అంతా చెరువు వద్దనే గడిపారు. మరోవైపు సీఎం జగన్ ఎమ్మెల్యే చెవిరెడ్డితో ఫోన్ లో రాయల చెరువు పరిస్థితి పై ఆరా తీసారు. జాగ్రత్త చర్యలను పాటించాలని సూచించారు ముఖ్యమంత్రి.