
అసలేం జరిగింది..?
స్థానికంగా ఉన్న రౌడీ షీటర్లను అప్పుడప్పుడు పోలీస్ స్టేషన్లకు పిలిపించి పోలీసులు కౌన్సెలింగ్ ఇస్తుండటం తెలిసిందే. ఈ క్రమంలో ఈనెల 18 న కొందరు రౌడీ షీటర్లను ఏలూరు 2 టౌన్ పోలీస్ స్టేషన్ కు పిలిపించారు ఎస్సై, కానిస్టేబుళ్లు. వారిలో పేరుమోసిన రౌడీషీటర్ ఒకరున్నారు. ఆయన కేవలం రౌడీషీటరే కాదు, రాజకీయ నాయకుడు కూడా. స్థానిక కార్పొరేటర్ భర్త. భార్య కార్పొరేటర్ అయినా.. అన్ని వ్యవహారాలు ఈయనే చక్కబెడుతుంటారు. ఆరోజు ఆయన పుట్టినరోజు కావడంతో పోలీసులు కాస్త అత్యుత్సాహం ప్రదర్శించారు. అంత అభిమానం ఉంటే పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పి పంపించాల్సింది. కానీ స్టేషన్లోనే కేక్ కటింగ్ కార్యక్రమం పెట్టారు. కార్పొరేటర్ భర్త కదా.. కాస్త మర్యాదలు ఎక్కువ చేశారు. అయితే అక్కడే ఉన్న ఒకరు ఈ తతంగం అంతా వీడియో తీశారు.
పోలీస్ స్టేషన్లో పుట్టినరోజు సంబరాలు జరిపేందుకు ఆయనేమైనా జాతీయ నాయకుడా..? రౌడీషీటర్. అలాంటి రౌడీషీటర్ కి పోలీస్ స్టేషన్లో ఇలా మర్యాదలు జరుగుతాయని బాహ్య ప్రపంచానికి తెలిసింది. ఇక నేరగాళ్లకు ఆ పోలీస్ లంటే లెక్క ఉంటుందా..? సాధారణ ప్రజలకు పోలీసులంటే భరోసా ఉంటుందా..? సోషల్ మీడియాలో వీడియో వైరల్ కావడంతో ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. ఎస్సై, కానిస్టేబుల్ ని సస్పెండ్ చేయడంతోపాటు, సీఐకి చార్జ్ మెమో ఇచ్చారు. రౌడీ షీటర్ల పట్ల కఠినంగా వ్యవహరించాల్సిన పోలీసులు, ఇలా వారి బర్త్ డే లకు పోలీస్ స్టేషన్ నే వేదికగా చేయడం చర్చనీయాంశమైంది.