
వైఎస్ షర్మిల వైఎస్సార్టీపీ పేరుతో తెలంగాణలో పార్టీ పెట్టారు. అయితే ఆమె ఏపీలోనే పోటీ చేయొచ్చు కదా, వారి అన్నయ్య పార్టీలోనే ఉండొచ్చు కదా అని ప్రశ్నించారు డీకే అరుణ. 2019 ఎన్నికల్లో కూడా ఏపీలో షర్మిల ప్రచారం చేసిందనే విషయాన్ని ఆమె గుర్తు చేశారు. అప్పుడు తెలంగాణలో లేని షర్మిల, ఇప్పుడు సడన్ గా ఇక్కడికి వచ్చి పార్టీ పెట్టడం, తెలంగాణను ఉద్ధరిస్తామని అనడం దేనికి సంకేతం అని అన్నారామె. ఏపీలో ఆమె ఎందుకు పోటీ చేయడంలేదో చెప్పాలని ప్రశ్నించారు.
బీజేపీ కుటుంబ పాలనకు వ్యతిరేకం అని చెప్పారు డీకే అరుణ. విభజన సందర్భంగా ముంపు మండలాలను ఏపీలో కలిపారని, ఇప్పుడు ఆ విషయంలో కేసీఆర్ రాజకీయం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. ముంపు మండలాల్లో కనీస సౌకర్యాలు లేవని, ఆ దిశగా ఏపీ ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారామె. అందుకే ముంపు మండలాల ప్రజలు తమను తెలంగాణలో తిరిగి కలిపేయాలని కోరుతున్నారని చెప్పారు. తెలంగాణలో టీఆర్ఎస్ కి 2023లో అధికారం దక్కదని అన్నారు డీకే అరుణ. కేసీఆర్ ప్రజాదరణ కోల్పోతున్నారని, బీజేపీ తెలంగాణలో పుంజుకుంటోందని చెప్పారు. వచ్చే దఫా తెలంగాణలో బీజేపీదే అధికారం అని ధీమా వ్యక్తం చేశారామె.