దేశ రాజకీయాల్లో మరోసారి ఉపరాష్ట్రపతి ఎన్నికల హీట్ మొదలైంది. ఈసారి కూడా పోటీ గట్టిగానే ఉండబోతోందన్న టాక్ సర్కిల్‌లో వినిపిస్తోంది. ఎన్డీయే, ఇండియా కూటముల మధ్యా ప్రతిష్టాత్మక యుద్ధం కాస్తోంది. కానీ అసలు హంగామా మాత్రం తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఈసారి ఇండియా కూటమి తరఫున నిలబడిన అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి తెలుగు వాడే కావడం గేమ్‌లో అసలైన ట్విస్ట్ అయ్యింది. వైసీపీ విషయానికొస్తే.. బయటకు చెప్పకపోయినా లోపల పెద్ద మల్లగుల్లాలే నడుస్తున్నాయని అంటున్నారు. పార్టీ సీనియర్ లీడర్లు ఇప్పటికే ఎన్డీయే అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్‌కి మద్దతు ఇవ్వడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. కానీ అదే సమయంలో వైసీపీకి అండగా నిలిచే ఒక బలమైన సామాజిక వర్గం మాత్రం “జస్టిస్ సుదర్శన్ రెడ్డి రాజకీయాలకు అతీతుడు .. మన వాడే .. ఆయనకు మద్దతు ఇవ్వకపోతే ప్రజల మధ్య మైనస్ అవుతాం” అని ఒత్తిడి పెడుతోందట. ఇదే వైసీపీలోని పెద్ద తలనొప్పి.


అదే సమయంలో బీజేపీతో స్నేహం కొనసాగించాలంటే రాధాకృష్ణన్ వైపే చూడాలి. కానీ అలా చేస్తే బలమైన సామాజిక వర్గం అసంతృప్తి తప్పదని స్ట్రాటజిస్ట్‌లు చెబుతున్నారు. ఈ పరిస్థితి వైసీపీలో “ఏం చేసినా దెబ్బ .. ఏం చేయకపోయినా దెబ్బ” అన్నట్టుగా తయారైందని లోగుట్టు. ఇక తెలంగాణాలో బీఆర్ఎస్ స్టోరీ కూడా అంతే. బయటకు న్యూట్రల్‌గా కనిపిస్తున్నా .. లోపల మాత్రం గట్టి చర్చ నడుస్తోందట. కాంగ్రెస్ ప్రధాన శత్రువుగా ఉన్న బీఆర్ఎస్, ఇండియా కూటమి అభ్యర్థికి నేరుగా మద్దతు ఇవ్వడానికి వెనకాడుతోంది. కానీ, జస్టిస్ సుదర్శన్ రెడ్డి తెలంగాణా వాసి కావడం , రాజకీయ వాసనలు లేని వ్యక్తిగా ఉండటం బీఆర్ఎస్‌ని ఇబ్బందుల్లో పడేస్తోంది. “రేపు ప్రజల ముందెప్పుడు సమాధానం చెప్పాలి?” అనే భయం ఆ పార్టీని కుంగదీస్తోంది.



మొత్తానికి ఇప్పుడు వైసీపీ – బీఆర్ఎస్ రెండు పార్టీలూ డైలమాలోనే ఉన్నాయి. ఒక వైపు రాజకీయ లెక్కలు.. మరో వైపు తెలుగు అభ్యర్థి అనే సెంటిమెంట్. ఈ రెండింటి మధ్య నుయ్యి వెనక గొయ్యి స్థితిలో ఈ రెండు పార్టీలు చిక్కుకున్నాయి. వైసీపీ చివరికి ఎన్డీయే వైపు మొగ్గుతుందని అంతర్గత టాక్ ఉన్నా, బలమైన సామాజిక వర్గం ఒత్తిడి పార్టీని గట్టిగా పట్టేస్తోందని అంటున్నారు. బీఆర్ఎస్ మాత్రం ఇంకా ఫైనల్ నిర్ణయం తీసుకోలేదని, రాబోయే రోజుల్లోనే దాని దిశ తేలుతుందని చెబుతున్నారు. అందుకే దేశ ఉపరాష్ట్రపతి ఎన్నికల పోరు కేవలం రెండు కూటముల మధ్య పోరుగా కాకుండా.. తెలుగు రాష్ట్రాల రాజకీయాలకు కూడా పరీక్ష పత్రంగా మారిపోయింది. ఇక్కడ ఎవరు ఎటు తిరుగుతారో.. ఆ ఒక్క నిర్ణయమే గేమ్‌ను పూర్తిగా మార్చేయబోతోందన్న మాట!

మరింత సమాచారం తెలుసుకోండి: