వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌చ్చేయాల‌ని... భావిస్తున్న జ‌నసేన పార్టీ.. దూకుడు పెంచిన విష‌యం తెలిసిందే. పార్టీ ఆవిర్భావ దినోత్స‌వాన్ని ఘ‌నంగా నిర్వ‌హించిన పార్టీ అధినేత ప‌వ‌న్‌.. తాజాగా మ‌రోసారి పార్టీ విస్తృత స్థాయి స‌మావేశం ఏర్పాటు చేశారు. దీనిలో ఆయ‌న కొన్ని సంచ‌ల‌న విష‌యాలు వెల్లడించా రు. పార్టీ భ‌విత‌వ్యాన్ని త‌న‌కు వ‌దిలేయాల‌ని నేత‌ల‌కు సూచించారు. అదేస‌మ‌యంలో నేత‌ల‌కు ప‌రోక్షం గా వార్నింగ్ కూడా ఇచ్చారు. పార్టీ వ్యూహాల‌పై ఎవ‌రూ నోరు విప్పద్ద‌ని హెచ్చ‌రించారు.

మ‌రీ ముఖ్యంగా.. జిల్లాల్లో పార్టీని బ‌లోపేతం చేసేందుకు తానే స్వ‌యంగా రంగంలోకి దిగుతాన‌ని చెప్పా రు. అంతేకాదు.. తాను ఎవ‌రికో ప‌ల్ల‌కీ మోసేందుకు రాజ‌కీయాల్లోకి రాలేద‌ని... ప్ర‌జ‌ల‌ను ప‌ల్ల‌కీ ఎక్కించేం దుకు మాత్ర‌మే వ‌చ్చాన‌ని చెప్పారు. అయితే.. ఈ విష‌యాల‌పై పార్టీ నాయ‌కులు త‌ల‌లు ప‌ట్టుకుంటు న్నారు. ప‌వ‌న్ చేసిన వ్యాఖ్య‌ల్లో క్లారిటీ మిస్ అయింద‌ని చెబుతున్నారు. ఎందుకంటే.. వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబంధించి వైసీపీ వ్య‌తిరేక ఓటు బ్యాంకును చీల్చ‌బోన‌ని చెప్పిన ప‌వ‌న్ వ్యాఖ్య‌ల‌తో  టీడీపీ నేత‌ల‌తో క‌లిసి మెలిసి ప‌నిచేయాల‌ని... ఇప్ప‌టికే జ‌న‌సేన నాయకులు మాన‌సికంగా సిద్ధ‌మ‌య్యారు.

అయితే.. ఇప్పుడు `నేను ఎవ‌రికో ప‌ల్ల‌కీ మోసేందుకు రాలేదు`` అని వ్యాఖ్యానించ‌డంతో.. ఇది టీడీపీని ఉద్దేశించి చేసిందేన‌నినాయ‌కులు అనుకుంటున్నారు. అంటే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీతో పొత్తు ఉండ‌ద ని.. ప‌వ‌న్ ప‌రోక్షంగా చెప్పారా? అని నేత‌ల మ‌ధ్య గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. అదేస‌మ‌యంలో జిల్లాల్లో పార్టీని బ‌లోపేతం చేసేందుకు కృషి చేస్తాన‌ని అన్నారు. దీనికి కార్యాచ‌ర‌ణ మాత్రం చెప్ప‌లేదు. ఎన్నిక‌ల‌కు ముందు.. రంగంలోకి దిగుతారా..?  లేక‌.. ఇప్ప‌టి నుంచి షెడ్యూల్ మార్చుకుని రంగంలోకి దిగుతారా? అనేది కూడా సందేహంగానే ఉంది.

ఇక‌, నాయ‌కులు త‌మ స్తాయికి మించి మాట్లాడొద్ద‌ని ప‌వ‌న్ హెచ్చ‌రించారు. దీనిని ఎక్కువ మంది త‌ప్పు ప‌డుతున్నారు. పార్టీలు.. రాజ‌కీయాలు అంటే.. అంతో ఇంతో విమ‌ర్శ‌లు కూడా వ‌స్తుంటాయి. ప్ర‌త్య‌ర్థి పార్టీ ల నుంచే కాకుండా.. ఇది త‌ప్పు.. ఇది ఒప్పు అని సొంత పార్టీ నేత‌లు కూడా చెబుతుంటారు. కానీ.. దీనిని తాను స‌హించేది లేద‌ని.. ప‌వ‌న్ వెల్ల‌డించారు. దీనివ‌ల్ల‌.. ఆత్మాభిమానం ఉన్న నాయ‌కులు.. సైలెంట్ అయిపోతారు. ఫ‌లితంగా క్షేత్ర‌స్థాయిలో పార్టీకి స‌ల‌హాలు అందే ప‌రిస్థితి కూడా ఉండ‌దు. మ‌రి దీనిని కూడా అన్నీ ఆలోచించే ప‌వ‌న్ వ్యాఖ్యానించారా? అని చ‌ర్చించుకుంటున్నారు. ఎలా చూసుకున్నా.. పార్టీ స‌మావేశంలో ఏమీ తేల‌లేద‌నే పెద‌వి విరుపులు మాత్రం క‌నిపించాయి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: