
2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై ఉండవల్లి అరుణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో మరోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని వెల్లడించారు ఉండవల్లి. ఈ విషయంలో ఎలాంటి అనుమానాలు అవసరం లేదని కూడా ఉండవల్లి తేల్చేశారు. అయితే ప్రస్తుతం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను 2024 ఎన్నికల వరకూ తీసుకెళ్లాల్సి ఉందన్నారు కూడా. కరోనా వైరస్ నేపథ్యంలో... పరిస్థితులకు అనుగుణంగా జగన్ సర్కార్ పరిపాలన కొనసాగుతోందన్నారు మాజీ ఎంపీ. ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా ప్రజల ఆర్థిక పరిస్థితి దారుణంగా పడిపోయిందన్నారు. ఇలాంటి విపత్కర సమయంలో... ప్రజలకు ఆర్థికంగా చేయూత ఇవ్వడంలో జగన్ సర్కార్ ముందు వరుసలో ఉందని కితాబిచ్చారు ఉండవల్లి అరుణ్ కుమార్. ప్రజలకు ఏదో ఒక రూపంలో ఆర్థికంగా అండగా నిలవాలనేది ప్రపంచంలోని ప్రముఖ ఆర్థిక వేత్తల సూచన అని ఉండవల్లి గుర్తు చేశారు. ఈ సంక్షోభ పరిస్థితుల నుంచి బయట పడటానికి ప్రజలకు ఆర్థికంగా చేయూతను అందించాల్సి ఉంటుందని ఆర్థికశాస్త్రంలో నోబెల్ బహుమతిని అందుకున్న ఆమర్త్యసేన్, రిజర్వు బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ సూచించారని ఉండవల్లి గుర్తు చేశారు. ప్రస్తుతం జగన్ ప్రభుత్వం అదే పని చేస్తోందన్నారు. అందుకే రాబోయే ఎన్నికల్లో కూడా వైసీపీ గెలుస్తుందన్నారు ఉండవల్లి.