
సరిహద్దులపై పెత్తనం చేసేందుకు తొలి నుంచి ఆక్రమణలకు పాల్పడుతున్న చైనా ఆర్మీ బలగాలు... ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్కు చెందిన ఓ 17 ఏళ్ల యువకుడిని ఎత్తుకెళ్లాయి. అరుణాచల్ ప్రదేశ్లోని ఎగువ సియాంగ్ జిల్లాకు చెందిన యువకుడిని చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ... పీఎల్ఏ అపహరించినట్లు ఆ రాష్ట్ర ఎంపీ తపిర్ గావో తాజాగా ట్వీట్లో వెల్లడించారు. మిరామ్ టారోన్ అనే యువకుడిని చైనా ఆర్మీ బలగాలు సియుంగ్లా ప్రాంతంలోని లుంగ్టా జోర్ ప్రాంతం నుంచి కిడ్నాప్ చేసినట్లు ఎంపీ తపిర్ గావో వెల్లడించారు. కిడ్నాప్ జరిగిన బిషింగ్ గ్రామం పూర్తిగా భారత భూభాగంలోనే ఉంది. అయితే ఈ ప్రాంతంలో 2018లోనే 4 కిలోమీటర్ల దూరం రహదారిని భారత భూభాగంలో చైనా నిర్మించింది. ఇప్పుడు అదే ప్రాంతం నుంచి మిరామ్ టారోన్ను పీఎల్ఏ బలగాలు అపహరించాయి. మిరామ్ టారోన్ను చైనా బంధిఖానా నుంచి త్వరగా విడిపించేందుకు దేశంలోని అన్ని ఏజెన్సీలు తీవ్రంగా కృష్టి చేయాలని ఎంపీ తపిర్ గావో విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు ఈ వ్యవహారం భారత్, చైనాల మధ్య మరోసారి ఉద్రిక్తతలకు దారి తీస్తోంది.