రాజీనామాకు ముందు మాజీ ఎంఎల్ఏ కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి ఏమని చెప్పారో సరిగ్గా ఇపుడదే జరుగుతోంది. తాను రాజీనామా చేస్తేకానీ కేసీయార్ మునుగోడులో అభివృద్ధి కార్యక్రమాలు చేయరని మాజ ఎంఎల్ఏ పదే పదే చెప్పారు. తన నియోజకవర్గం డెవలప్ కావాలన్న ఉద్దేశ్యంతోనే రాజీనామా చేస్తున్నట్లు చెప్పి మరీ ఎంఎల్ఏగా రాజీనామాచేశారు. ఆయన ఏ ముహూర్తంలో రాజీనామా చేశారో కానీ ఇపుడదే అక్షరాల జరుగుతోంది.





ఉపఎన్నికకు ఇంకా నోటిపికేషన్ రాకముందే నియోజకవర్గంలో డెవలప్మెంట్లకు కేసీయార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. పంచాయితీ రాజ్ రోడ్లు, భవనాలు, ఆర్ అండ్ బీ రోడ్లు, యువజన సంఘాలకు భవనాలు, అంగన్ వాడీ భవనాల నిర్మాణాలు, గ్రామాల్లో ఇంటర్నల్ రోడ్ల నిర్మాణాలకు జిల్లా యంత్రాంగం పంపిన ప్రతిపాదనలకు కేసీయార్ యుద్ధ ప్రాతిపదికన ఓకే చెప్పేస్తున్నారు.






ప్రతిపాదనలకు ఓకే చెప్పటమే కాదు వెంటనే నిధులు కూడా విడుదల చేయిస్తున్నారట. సుమారుగా రు. 300 కోట్ల ప్రతిపాదనలకు నిధులు విడుదల అవుతున్నాయని సమాచారం. నిజానికి ఇవన్నీ రోటీన్ గా జరిగిపోవాల్సిన అభివృద్ధే. ఎంఎల్ఏగా ఎవరున్నారన్నదానితో సంబంధంలేకుండా అవసరాన్ని బట్టి ప్రభుత్వం నిధులు విడుదలచేసి పనులు చేయాలి. కానీ కేసీయార్ ప్రభుత్వం ఆపని చేయటంలేదు. తనకు ఇష్టంలేని ఎంఎల్ఏ ఉన్న నియోజకవర్గాల్లో కేసీయార్ ఎలాంటి అభివృద్ధి పనులు జరగనీయటంలేదు.





ఇలాంటి చేష్టల వల్లే హుజూరాబాద్ నియోజకవర్గంలో దెబ్బతిన్నారు. ఈటల రాజేందర్ మీద ధ్వేషంతో నియోజకవర్గంలో ఒక్కపని కూడా జరగనీయలేదు. చివరకు ఈటల రాజీనామాచేసి ఉపఎన్నిక ఖాయమైన తర్వాతే పనులు చకచకా జరిగాయి. వందల కోట్ల రూపాయలతో డెవలప్ చేసినా చివరకు ఏమైంది ? ఉపఎన్నికలో  టీఆర్ఎస్ బోల్తాపడింది. రోటీన్ గా జరిగిపోవాల్సిన పనులను కూడా కేసీయార్ ఆపేస్తుంటే జనాలకు ప్రభుత్వం మీద మండకుండా ఉంటుందా ? ఆ మంటతోనే ఉపఎన్నికలో కేసీయార్ ఎన్ని వందల కోట్లరూపాయలు ఖర్చుచేసినా జనాలు ఓడగొట్టి తమ మంటను చల్లార్చుకున్నారు. మరి రేపటి మునుగోడు ఉపఎన్నికలో ఏమవుతుందో చూడాల్సిందే.



మరింత సమాచారం తెలుసుకోండి: