ప్రజాస్వామ్య వ్యవస్థలో పత్రికలు పట్టుకొమ్మల్లాంటివి. ప్రభుత్వాలకు, ప్రజలకు వారధిగా నిలచేవి పత్రికలు. న్యాయవ్యవస్థ తరువాత పత్రికలపై ప్రజలకు అపారమేన నమ్మకం. తెలంగాణ సాయుధ పోరాట కాలంలో సురవరం ప్రతాపరెడ్డి, మోటూరు హనుమంతరావు,షోయబుల్లాఖాన్, కృష్ణా పత్రిక, నీలగిరి పత్రిక, ఆంధ్రప్రభ, విశాలాంధ్ర, ప్రజాశక్తి పత్రికలు ఒక ఆశయంతో పుట్టుకొచ్చాయి. నిలదొక్కుకోవడానికి కష్టనష్టాలను ఓర్చారు. ఆనాడు ఈ పత్రికలను ఆదరించేవారు. ప్రచురించిన కథనాలను ప్రజలు నమ్మేవారు. ప్రజా ఉద్యమాలకు దగ్గరిగా ఉండేవి.

దీంతోపాటు తెలంగాణ సాయుధ పోరాటంలో ప్రజలను చేతన్యవంతులుగా తీర్చిదిద్దడంలో క్రీయాశీలక పాత్రను పోషించారు. మద్దుకూరి చంద్రశేఖర్ రావు, ప్రజాకవి ముగ్ధుం, చండ్ర రాజేశ్వర్ రావు, బాలగంగాధర్ తిలక్ లాంటీ మహనీయులు పత్రిక విలువలను కాపాడారు. ప్రజలకు సంబంధించిన వార్తలను అందించేవారు. ఆనాటి రోజుల్లో విశాలాంధ్ర, ప్రజాశక్తి విజయవాడ నుంచి ప్రచురణలు వచ్చేవి. వామపక్ష ప్రజాతంత్ర ఉద్యమాలకు ప్రేరణ కలిగించాయి. ఈ మధ్యకాలంలో పెట్టుబడిదారులు పత్రిక రంగంలోకి రావడంతో ప్రజాస్వామ్య వ్యవస్థలో పత్రికలు, చానళ్ల విలువలు పతనమౌతున్నాయి.

భారతదేశంలో ఎలక్ట్రానిక్ మీడియా, టీవీ ఛానల్స్ సుమారు 865 ఉన్నాయి. 1500 పైగా పత్రికలు ఉన్నాయి. పత్రికలు ప్రజా సమస్యలను విస్మరించి వ్యాపార దృక్పథంతో పని చేస్తున్నాయి. పెయిడ్ ఆర్టికల్స్ అత్యంత ప్రమాదకరం. పత్రికల మధ్య పోటీతత్వం పెరిగింది. పోటాపోటీగా వార్తలు అందిస్తున్నారు. వార్తలు నిజమా, అబద్దమా అనేది తేల్చకుండానే ప్రచురించడం వల్ల ప్రజలు అయోమయానికి గురవుతున్నారు. తమిళనాడు మాధిరిగా మన రాష్ట్రంలో రాజకీయ పార్టీలకు ఏ పార్టీకి ఆ పార్టీ పత్రికలు నడుస్తున్నాయి. వైకాపాకు పత్రికతోపాటు చానల్ ఉండగా, టిఆర్ఎస్ కు కూడా అదేవిధంగా ఉంది. కాగా కొన్ని పత్రికలు, చానళ్లు టిడిపికి అండదండగా ఉన్నాయి. దీంతో సిపిఎంకు కూడా ఇదే విధంగా ఉన్నాయి. ఏపార్టీ వార్తలను ఆచానళ్లు, పత్రికలు ప్రాధాన్యతనిచ్చి అసలు విషయాలు బయటకు రాకుండా చేస్తున్నాయి. ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు ప్రచురించడం, ప్రసారం చేయడం వంటి విధానం నాలుగైదు సంవత్సరాలనుండి పెరిగిపోయింది.

డబ్బు, అధికారం ఉన్నవారికి భజన పరులుగా మారి కొందరు జర్నలిజానికే మచ్చ తెస్తున్నారు. పత్రికాధి పతులు సంపాదకులు వాస్తవాలను వక్రీకరించకుండా ఉన్నది ఉన్నట్లుగా వార్తలు అందిచినట్లైతే పత్రికలకు జనం జీవం పోస్తారు. పత్రికలను ప్రజలే బ్రతికించుకుంటారు. పత్రికలు అటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకు మధ్య వారధిగా నిలవాలి. ఉన్నది ఉన్నట్లుగా చూపడం వాస్తవాలు. ప్రజలను ప్రతిభింబించే విధంగా ఉండాలి. అప్పుడు చిరకాలం పత్రికలు ప్రజల మధ్య బ్రతుకుతాయి. పత్రికలే ప్రజాస్వామ్యానికి పట్టుగొమ్మలు కాబట్టి నిజాలను దాచకుండా, అబద్దాన్ని ప్రచురించకుండా , ప్రసారం చేయడం జరిగితే అటువంటి చానల్, పత్రికలు ప్రజల్లో చిరస్థాయిగా ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: