కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మరో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. మల్లన్న సాగర్ ప్రాజెక్టును సీఎం కేసీఆర్ జాతికి అంకితం చేశారు. కొమురవెల్లి మల్లన్నకు ప్రత్యేక పూజలు చేసిన కేసీఆర్.. తర్వాత స్విచ్ ఆన్ చేసి మల్లన్న సాగర్ రిజర్వాయర్ లోకి నీటిని విడుదల చేశారు. తెలంగాణలో అత్యధికంగా.. 50 టీఎమ్ సీల నీటి సామర్థ్యమున్న జలాశయం ఇదే. ఈ ప్రాజెక్టుతో 14లక్షల ఎకరాలకు గ్రావిటీపై సాగునీరు అందించవచ్చు.

తెలంగాణకు కరవు రాకుండా చేసే ప్రాజెక్టే కాళేశ్వరం అని సీఎం కేసీఆర్ అన్నారు. దేశమంతా కరవు వచ్చినా తెలంగాణకు మాత్రం రాదన్నారు. నూతన తెలంగాణలో నిర్మించుకున్న అతిపెద్ద ప్రాజెక్టు మల్లన్న సాగర్ అని చెప్పారు. మల్లన్న సాగర్ ప్రారంభంతో కాళేశ్వరం కల సాకారమైందన్నారు. ఈ ప్రాజెక్టు ఆపేందుకు ఎన్నో కేసులు వేశారనీ.. అయినా వెనక్కి తగ్గలేదని తెలిపారు. పరిహారం అందని వారికి అందేలా చేస్తామన్నారు.

జాతీయ రాజకీయాలను ప్రభావితం చేసే దిశగా ముందుకు సాగుతున్నానని సీఎం కేసీఆర్ అన్నారు. వందకు వందశాతం తన మేధో సంపత్తిని ఉపయోగించి.. చివరి రక్తపు బొట్టు ధారబోసైనా సరే.. దేశాన్ని గాడిలో పెడతానని స్పష్టం చేశారు. ప్రశాంతమైన పాలనతోనే తెలంగాణకు పెట్టుబడులు వస్తున్నాయనీ.. కుల, మత విద్వేషాలు దేశానికి మంచివి కావన్నారు. వాటిని తరిమికొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

మరోవైపు మల్లన్న సాగర్  తెలంగాణకే తలమానికమని మంత్రి హరీశ్ రావు అన్నారు. మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవ సభలో ఆయన ప్రసంగించారు. ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా ప్రాజెక్టు ఆగలేదన్నారు. ప్రాజెక్టుపై వందల కేసులు సుప్రీం కోర్టు కొట్టేసిందన్నారు. దేశంలో నదిలేని చోట ప్రాజెక్టు కట్టింది కేసీఆరేనన్నారు హరీశ్ రావు. జంటనగరాల అవసరాల కోసం 30టీఎంసీలు కేటాయించారు. మల్లన్న సాగర్ ద్వారా 7జిల్లాల్లో తాగు నీరు అందనుందని చెప్పారు. మొత్తానికి ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రానికి నీటి కొరత లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.








మరింత సమాచారం తెలుసుకోండి: