2024 ఎన్నికల్లో జగన్ 175 సీట్లు టార్గెట్ పెట్టుకున్నారు. అయితే విజయసాయిరెడ్డి మాత్రం ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏపీ అసెంబ్లీలో 133 సీట్లు వైసీపీకి వస్తాయని అంటున్నారు. ఈమేరకు ఇండియా టీవీ చేసిన ఓ సర్వే రిపోర్ట్ ని ఆయన సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం విజయవంతమైతే 150కి పైగా సీట్లు వస్తాయని చెబుతున్నారు విజయసాయిరెడ్డి. మరి జగన్ టార్గెట్ 175 రీచ్ కావడం వైసీపీకి అసాధ్యమేనా..?

2019 ఎన్నికల్లో వైసీపీకి 151 సీట్లు వచ్చాయి. దానికి ఏమాత్రం తగ్గినా జగన్ ప్రభావం తగ్గినట్టేనని టీడీపీ ఆరోపిస్తుంది. అయితే అధికారంలోకి రావడమే ఏ పార్టీకయినా పరమావధి. మ్యాజిక్ ఫిగర్ చేరితే చాలు, ఆ పైన ఎన్నిసీట్లొచ్చినా అది బోనస్. కానీ ఏపీలో మాత్రం టార్గెట్లు బాగా పెద్దవవుతున్నాయి. వైసీపీకి 151 సీట్ల మెజార్టీ అంటే చాలా పెద్ద టార్గెట్ అచీవ్ చేసినట్టు, ఈ సారి జగన్ 175 సీట్ల టార్గెట్ పెట్టుకున్నారు. 175 అసాధ్యం కావొచ్చు కానీ, ఎమ్మెల్యేలకు, ఇతర నేతలకు అంత పెద్ద టార్గెట్ పెడితేనే వారు గత ఎన్నికలకంటే ఎక్కువ సీట్లు తేగలరనేది జగన్ ఆలోచన. అందుకే ఆయన టార్గెట్ 175 అంటున్నారు.

టీడీపీ కూడా తమకి 130 సీట్లు వస్తాయని అంచనా వేస్తోంది. గతంలో పలుమార్లు టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. ఎవరికి వారు భారీ టార్గెట్లు పెట్టుకుంటే ఏపీలో మిగతా పార్టీల పరిస్థితి ఏంటో.. ఆయా పార్టీల దృష్టిలో మిగతా పార్టీలు ఎంత తక్కువ పర్ఫామెన్స్ చేస్తాయని అనుకుంటున్నారో అర్థం చేసుకోవచ్చు. వైసీపీ పథకాలపై ప్రజలకు ఎలాంటి అభిప్రాయం ఉందో పలు ఉప ఎన్నికలు, స్థానిక ఎన్నికల ద్వారా అర్థమవుతోంది. అయితే 2024 నాటికి పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేం. రోడ్ల మరమ్మతులు, మద్యపాన నిషేధం వంటి విషయాలపై ప్రజలు, మహిళలు ఎలా రియాక్ట్ అవుతారో అంచనా వేయలేం. వీటన్నిటినీ కలిపితే వచ్చే ఎన్నికల్లో వైసీపీ 175 టార్గెట్ రీచ్ అవుతుందో లేదో. అయితే విజయసాయిరెడ్డి మాత్రం 150 టార్గెట్ పెట్టుకున్నట్టు తెలుస్తోంది. 2024 ఎన్నికల్లో 150కంటే ఎక్కువ సీట్లు గెలుస్తామని ధీమాగా చెబుతున్నారాయన.

మరింత సమాచారం తెలుసుకోండి: