చేప‌ట్టే ప్ర‌తి కార్యం ఎటువంటి విఘ్నాలు లేకుండా విజ‌య‌వంతం కావ‌డానికి దేవ‌త‌ల ద‌గ్గ‌ర నుంచి మాన‌వుల వ‌ర‌కు అంద‌రూ విఘ్నేశ్వ‌రుణ్నే పూజిస్తారు. విఘ్నాల‌కు అధిప‌తి అయిన ఆ లంబోద‌రుడి శ‌రీర భాగాల్లో ఎన్నో ర‌హ‌స్యాలు ఇమిడివున్నాయ‌ని మీకు తెలుసా. ప్ర‌తి అణువు, ప్ర‌తి క‌ణ‌జాలం, ప్ర‌తి అంగానికి ఒక్కో విశిష్ట‌త ఉంది. అవేంటో ఒక‌సారి మ‌నం కూడా తెలుసుకొని ఆ గ‌జాన‌నున‌ణ్ని మ‌న‌సారా కొలుద్దాం!!

చిన్నారుల‌కు ఇష్ట‌మైన బొజ్జ గ‌ణ‌ప‌య్య‌
మన పురాణాలు ఇతిహాసాలు మనం ఎలా జీవించాలో చెప్పాయి. అలాగే దేవతల రూపాల‌ నుంచి మనం ఏమేం తెలుసుకోవ‌చ్చు.. వాటిని జీవితానికి ఎలా అన్వ‌యించుకోవ‌చ్చో కూడా తెలిపారు. దేవతా రూపాల‌లో ప్ర‌థ‌మ పూజ్యుడు  విఘ్నేశ్వరుడిది విభిన్న రూపం. ఏనుగు తల, పెద్ద బొజ్జ, పొట్టి రూపం. ఈ శరీరం అంటే పిల్లలకి చాలా ఇష్టం. ఈ శరీరం గొప్ప సందేశం ఇస్తుంది.

ఒక్కో భాగం ఒక్కో అంశానికి ప్రతీక

ఆటంకాలను తొలగించే చిన్న తల, చిన్న విషయాలను కూడా గ్రహించగల శక్తి కలిగిన చిన్న కళ్లు, అన్ని విషయాలను శ్రద్ధ‌గా వినే పెద్ద చెవులు, ఆత్మ గౌవరం కలగడానికి చిహాంగా తొండం, తక్కువగా మాట్లాడమని సూచించే నోరు, అమితమైన జ్ఝానాన్ని సంపాదించుకోమని చెప్పే పెద్ద బొజ్జ, ధర్మ, అర్థ, కామం, మోక్షం సాధించడానికి నాలుగు చేతులు, కోరికలను అదుపులో పెట్టుకోవడానికి ప్రతీకగా ఎలుక వాహనం.

వినాయకుడి ఆకృతి నుంచి మనం ఏమేం తెలుసుకోవచ్చో, ఎలా జీవించాలో ఒక‌సారి చూద్దాం!!

వినాయకుడి తల -ఏనుగు తల
విఘ్నేశ్వరుడి శిరస్సు ఏనుగు శిరం దీని అర్ధం. అటు బలమైన కార్యాలను, ఇటు బుద్ధికి సంబంధించిన కార్యాల్ని రెండింటినీ నిర్వహించగల సామర్థ్యం గల ఏకైక జీవి ఏనుగు. అటువంటి ఏనుగు తలను ధరించిన గణపతి బుద్ధి భావాలకు చక్కని ప్రతీక అని చెప్పబడుతోంది.

వినాయకుడి పెద్ద చెవులు - చిన్ని కళ్ళు
ఇక విఘ్నేశ్వరుడి చెవులు పెద్దవి, కళ్ళు చిన్నవి. ఎంతటి చిన్న విషయాల్ని అయినా పెద్ద చెవులతో వినాలని ఆయన చెవులు చెప్తుంటే, కామానికి మూలమైన కళ్లు చిన్నవిగా ఉండాలని, జన్మ పరంపరల్ని ఆపాలంటే కళ్లను ఎక్కువ సమయం తెరిచి ఉంచ‌కుండా ధ్యానముద్రలో మూసి ఉంచాలని పురాణాలు చెబుతున్నాయి.

వినాయకుడి పొట్ట రహ‌స్యం :
ఇక విఘ్నేశ్వరుడి ఉదరం బహు పెద్దది. మనిషి దీర్ఘాయువుగా ఉండాలంటే పొట్ట పెద్దదిగా ఉండాలని పతంజలి యోగ శాస్త్రం చెపుతోంది. పెద్ద పొట్టను సృష్టి రహస్యాల్ని, యోగ రహస్యాల్ని దాచే పరికరంగా చెపుతారు.

వినాయకుని పాదాలు :
ఇదేవిధంగా నిత్యకర్మాచరణాన్ని అనుసరించే ఎవరైనా మన చరణాలకు నమస్కరించడం జరుగుతుందని చెప్పడానికే వినాయకుని పాదాలు చిన్నవిగా ఉంటాయి.

వినాయకుని రూపం:
విఘ్నేశ్వరుని తల విఘ్ననాశిని, చిన్ని కళ్ళు-సూక్ష్మ దృష్టిని, తొండం-ఆత్మాభిమానాన్ని, పెద్ద చెవులు- సహనంగా అన్నింటినీ  వినడాన్ని, దంతాలు- పరులకు హాని చేయకపోవడాన్ని, చిన్న నాలుక-ఆత్మపరిశీలనకు, పెద్ద పొట్ట-జ్ఞాన భాండాగారానికి సూచకాలు.

నాలుగు చేతులు :
నాలుగు చేతులు.. చతుర్విధ పురుషార్థాలైన ధర్మ, అర్థ, కామ, మోక్షాలకు, చిన్నినోరు తక్కువ మాట్లాడటానికి, ఎలుక వాహనం  కోరికలను అదుపులో ఉంచుకోవాల‌ని చెపుతారు.

వక్రతుండుడు :
లంబోదరుడు, వక్రతుండుడు అని పిలువబడే మ‌న వినాయకుడు ఉద్భవించిన రోజున ఇళ్లల్లో, వ్యాపార సంస్థ‌ల్లో సిద్ధి, బుద్ధి అని రెండు వైపులా రాసి స్వస్తిక్‌ పద్మం లిఖించడం ద్వారా శుభాన్ని ఆకాంక్షిస్తారు మ‌న పెద్ద‌లు. ఈ గుర్తు గీసి “అస్మిన్ స్వస్తిక పద్మే శ్రీ మహాగణపతిం ఆవాహయామి” అని ఆవాహన చేసి మహాగణపతికి పూజలందిస్తారు.


విజ్ఞ రాజు :
కార్యాలను సిద్దింప చేసే విజ్ఞ రాజు వినాయకుడు. మహాగణపతికి, స్వస్తిక పద్మానికి అవినాభావ సంబంధం ఉంది. హోమం, ప్రతిష్ట, అనుష్టానాదులతో నవగ్రహాలతో పాటు గణపతి స్థానంలో స్వస్తిక పద్మం వేసి గణపతిని ఆరాధించడం చేస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని మ‌న పురాణాలు చెబుతున్నాయి.






మరింత సమాచారం తెలుసుకోండి: