టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోల్లో అక్కినేని నాగార్జున స్టయిలే వేరు. కుమారులు నాగ చైతన్య, అఖిల్ తో పోటీపడే ఫిట్ నెస్ నాగ్ సొంతం. ఇంకా ఆయనలో రొమాంటిక్ సినిమాలు చేసే ఛార్మ్ ఉందంటే అతిశయోక్తి కాదు. ప్రస్తుతం బిగ్ బాస్4 సీజన్ లో హోస్ట్ గా వ్యవహరిస్తూ సత్తా చాటుతున్నాడు. మరోవైపు మనాలి వెళ్లి వైల్డ్ డాగ్ షూటింగ్ కూడా కంప్లీట్ చేశాడు. ఈ సినిమా తర్వాత నాగ్ చేయబోయే సినిమా దర్శకుడు ప్రవీణ్ సత్తారుతో అని వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఆయన మరో సినిమాకు కూడా ఓకే చెప్పారని వార్తలు వస్తున్నాయి.



నాగార్జున హీరోగా 2016లో వచ్చిన సోగ్గాడే చిన్నినాయనా సినిమా ఆ ఏడాది సంక్రాంతికి వచ్చి హిట్ అయింది. చలాకీ పూలరంగడి తరహాలో పాత్రలోనూ, యువకుడిగానూ రెండు పాత్రల్లో వేరియేషన్స్ చూపించి సక్సెస్ సాధించాడు. ఆ సినిమాలో నాగ్ పోషించిన బంగార్రాజు పాత్ర నాగ్ కు మంచి పేరు తీసుకొచ్చింది. దీంతో ఆ సినిమాకు సీక్వెల్ తీయాలని నాగ్ ప్రయత్నాలు చేశాడు. దర్శకుడు కల్యాణ్ కృష్ణ ఇందుకు సంబంధించి ప్రయత్నాలు చేసినా కథ అనుకున్నట్టు రాకపోవడంతో మళ్లీ ఆ సినిమాపై వార్తలు లేవు. ఇప్పుడు ఈ సినిమాపై కదలిక వచ్చిందని తెలుస్తోంది.

కల్యాణ్ కృష్ణ రాసిన కథను నాగ్ కు వినిపించినట్టు ఫిలింనగర్ సర్కిల్స్ లో ఓ వార్త రౌండ్ అవుతోంది. కథ నాగ్ కు నచ్చిందని ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. ఇదే నిజమైతే బంగార్రాజు పాత్రలో నాగార్జున మళ్లీ తన సత్తా చాటడం ఖాయమే. ప్రస్తుతానికి ఈ వార్త గాసిప్ గా చక్కర్లు కొడుతోంది. నాగార్జున లేదా కల్యాణ్ కృష్ణ దీనిపై పూర్తి క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.



మరింత సమాచారం తెలుసుకోండి: