
తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ సర్కారు అనుసరిస్తున్న వ్యవసాయ సానుకూల విధానాల నేపథ్యంలో అన్ని రకాల పైర్ల సాగు విస్తీర్ణం, దిగుబడులు పెరగడమే కాకుండా ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ అగ్రస్థానంలో ఉందని మంత్రి మల్లారెడ్డి కొనియాడారు. పర్యావరణహితం, ప్రజా ఆరోగ్యం దృష్ట్యా రాష్ట్రంలో సేంద్రీయ వ్యవసాయ విధానం అంశంపై ప్రతిపాదనను ముఖ్యమంత్రి కేసీఆర్ వద్ద పెడతానని మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాస్త్రవేత్తలు, నిపుణులు, సేంద్రీయ రైతులు, ఔత్సాహిక సేంద్రీయ వ్యాపారవేత్తలు పాల్గొని తమ అభిప్రాయాలు పంచుకున్నారు. హైదరాబాద్‌లో ప్రకృతి వ్యవసాయ రైతు - మధ్యతరగతి అనుసంధాన వేదిక నిర్మాణంపై నిపుణులు విస్తృతంగా చర్చించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో సహజ వ్యవసాయం చేస్తున్న రైతులు పండించిన బియ్యం, పాలు, నెయ్యి, పసుపు, అల్లం, ఎల్లుల్లి, ఉల్లిగడ్డ, ఇతర కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు వంటి ఉత్పత్తులు విక్రయించేందుకు సేంద్రీయ రైతు బజార్లు నెలకొల్పేందుకు సాగుతున్న సన్నాహాల గురించిన వారు ప్రస్తావించారు.
రాబోయే రోజుల్లో రసాయన వ్యవసాయానికి ప్రత్యామ్నాయంగా సహజ, సేంద్రీయ, గో-ఆధారిత సేద్యం చేస్తున్న రైతుల పనితనానికి గొప్ప గుర్తింపు లభిస్తుందని నిపుణులు ధీమా వ్యక్తం చేశారు. ప్రపంచంలో అత్యంత తెలివి, నైపుణ్యాలు కలిగిన వైద్యులు, శాస్త్రవేత్తలు, ఐటీ నిపుణులు, యువత భారతీయులేనని వారు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమం విజయ వంతం కావాలని వారు అభిప్రాయపడ్డారు.