
ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కరోనా విలయ తాండవం చేస్తున్న సమయాన రాష్ట్రాల రాజకీయాల విషయంలో తెలుగు మీడియా సంశయాత్మకంగా వార్తలు రాస్తున్నా జాతీయ మీడియా మాత్రం మంచి క్లారిటీ తోనే ఉన్నట్లు కనిపిస్తుంది. ప్రతిపక్ష వైరిపక్ష నిర్మూలనేనని ఉభయాంద్ర రాష్ట్రాల ముఖ్యమంత్రుల లక్ష్యమనే తేల్చేసింది. అందుకే ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న రాజకీయాలపై ఆంగ్ల జాతీయ మీడియాలో ఇటీవల కాలంలో విస్తృతంగా పలు కథనాలు వస్తున్నాయి. దీనికి కారణం తెలియదు. ఇది యాదృచ్చికమా? మరేదైనా కారణముందా? ఈ విషయం చాలా ఆసక్తికరంగా మారింది.
మరో గమనించాల్సిన విషయం ఏమంటే "తెలంగాణ హైకోర్టు కేసీఆర్ ను ఈ విషయంలో కొద్దిగా హెచ్చరించింది” కూడా! కరోనా నియంత్రణ విషయంలో తెలంగాణ ప్రభుత్వ తీరు క్షంతవ్యం కాదు. ప్రజా వైద్యం అరోగ్యం ఇంతగా నిర్లక్ష్యం చేస్తూ పాలన సాగిస్తున్న పాలకులు బహుశ ప్రపంచంలో ఎక్కడా ఉండరని విశ్లేషకులు చెపుతున్నారు. కరోనాతో తల్లడిల్లుతున్న ప్రజలను ప్రయివెట్ ఆసుపత్రుల మెడికల్ మాఫియా దోపిడి మరింతగా కుంగదీస్తుంది. వీటి వెనుక అధికార రాజకీయ పార్టీల అధినేతల స్నేహితులు, బంధువులే ఉన్నారని అంటున్నారు. వీళ్ళకు అడ్డంకిగా మారిన వైద్య ఆరోగ్య శాఖా మంత్రిని అందుకే వేరే రాజకీయ కారణాలను, అవినీతి అరోపణలు చేస్తూ పదవి నుండి తోలగించటం జరిగిందని అంటున్నారు. దీనిపై కొంత సంయమనం పాటించైనా చర్యలు తీసుకోవచ్చు కాని కక్షతో ఇలాంటి సంక్లిష్ట సమయంలో చర్యలు తీసుకోవటం క్షంతవ్యం కాదని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం
తెలంగాణ సీఎం కేసీఆర్ విషయానికి వస్తే, ఆయన కూడా తన సొంత మంత్రి వర్గం లోని ఈటల రాజేందర్ పైనే కేసులు పెట్టిస్తున్నారని, ఇప్పటికే మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేసిన విషయం కూడా రాజకీయంగా సంచలనం సృష్టించింది. అదే సమయంలో ప్రతిపక్ష నేతల నోరు నొక్కేందుకు పోలీసులను జోరుగా వినియోగిస్తున్నారని కూడా విమర్శలు ఉన్నాయి. ఈ క్రమంలో ఈటల పై మరింత ఉచ్చు బిగించేందుకు, దేవర యాంజల్ భూముల విషయం లో ఈటల పాత్రపై తేల్చేందుకు హుటాహుటిన నలుగురు ఐఏఎస్‌లతో కమిటీ వేయడాన్ని హైకోర్టు తప్పుబట్టింది.
ప్రస్తుతం కరోనా విలయం లో ప్రజలు అల్లాడుతుంటే, రాష్ట్రంలో శవాల గుట్టలు పేరుకుంటుంటే, ఈ కక్ష సాధింపు ఎందుకని, కూడా హైకోర్టు కేసీఆర్‌ను ప్రశ్నించింది. అదే సమయంలో కేసీఆర్ తన పద్ధతి మార్చుకోవాలని కూడా పరోక్షంగా హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ పరిణామాల నేపథ్యంలోనే జాతీయ మీడియా రెండు తెలుగు రాష్ట్రాల సీఎంల పైనా కథనాలు ప్రచురించింది. కరోనా సమయంలో రాజకీయ కల్లోలం అనే శీర్షికతో దాదాపు అన్ని జాతీయ మీడియాల్లోనూ కథనాలు రావడం సంచలనంగా మారింది ప్రస్తుతం అన్ని వర్గాలు కరోనాపై దృష్టి పెడుతుంటే, ఏపీ, తెలంగాణల్లో మాత్రం రాజకీయ కరోనా రాజుకుందని వ్యాఖ్యానించడం గమనార్హం.
ఏపీ విషయాన్ని తీసుకుంటే, ప్రధాన ప్రతిపక్షం టీడీపీ నేతలపై, సీఎం జగన్ సర్కారు వివిధ రూపాల్లో, కేసులు నమోదు చేస్తోంది. ఇప్పటికే సంగం డెయిరీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రను జైల్లో పెట్టారు. ఇక, ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు పై రెండు కేసులు పెట్టారు. ఒకటి రాజధాని భూముల విషయంలోను, రెండోది కరోనా సెకండ్ వేవ్ లో కీలకమైన వైరస్ వేరియంట్ గురించి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై కర్నూలుకు చెందిన ఒక నేత ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు నోటీసులు ఇచ్చేందుకు రెడీ అయ్యారు.
ప్రజాసేవ అంటూ రంగంలోకి దిగిన ఈ ఇద్దరు ముఖ్యమంత్రులు దాన్ని మరచిపోయి స్వార్ధం అహంకారం ఆహంతో అహరాహరం రగిలిపోవటం వీళ్ళను ఎన్నుకున్న ప్రజల ఖర్మ అంటున్నారు పరిశీలకులు.