ఏపీ సీఎం జగన్ సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఆయన ప్రత్యర్థులను ముప్పు తిప్పలు పెట్టడంలో ఏమాత్రం జాలి చూపరు. ఇందుకు ఆయన సీఎం అయిన దగ్గర నుంచి జరిగిన ఎన్నో ఉదంతాలు సాక్ష్యాలుగా చూపించొచ్చు. అయితే.. ఏమాటకు ఆ మాటే చెప్పుకోవాలి.. జగన్ తనను నిత్యం ఇబ్బంది పెట్టే కొన్ని మీడియా సంస్థలను మాత్రం ఏమీ చేయలేకపోయారు. అంటే.. ఏదో చేయాలని కాదు.. కానీ.. కొందరు మీడియా పెద్దలతో అప్రకటిత యుద్ధం చేస్తున్న జగన్.. ఆ దిశగా ఇప్పటి వరకూ పెద్ద పురోగతి ఏదీ సాధించలేకపోయారు. అయితే ఇందుకు సజ్జల రామకృష్ణారెడ్డి వంటి వైసీపీ సార‌థులు చెప్పేదేమిటంటే.. అసలు జగన్‌కు కక్ష సాధింపు లక్షణమే లేదని.


అందుకు వారు చెప్పే వాదన ఏంటంటే.. అసలు జగన్‌కు అలాంటి ఆలోచన ఉంటే.. ఇప్పటి వరకూ ఈ మీడియా పెద్దలపై చర్యలు తీసుకునేవారు కాదా అనేది.. అయితే.. కాస్త ఆలస్యమైనా జగన్ కక్ష సాధించడం మాత్రం తథ్యం అన్నట్టుగా సాగుతున్నాయి తాజా పరిణామాలు. ఇన్నాళ్లూ ఆంధ్రజ్యోతి వంటి పత్రికలు జగన్ సర్కారుపై ఎన్నో కథనాలు రాశాయి. జగన్ తలచుకుంటే.. ఏదో ఒక సాకు కింద ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణపై ఏదో ఒక కేసు పెట్టొచ్చు. అది పెద్ద విషయం కాదని ఆర్కేకు కూడా తెలుసు. కానీ.. ఇప్పటి వరకూ అలాంటి చర్యలు జరగలేదు.


కానీ ఇప్పుడు మాజీ ఐఏఎస్ లక్ష్మీనారాయణ ఇంటిపై ఏపీ సీఐడీ చేసిన సోదాల సమయంలో తమ విధులను అడ్డుకున్నారని ఏపీ సీఐడీ తాజాగా నమోదు చేసిన జీరో ఎఫ్‌ఐఆర్‌ చూస్తే.. జగన్ ఆర్కే పై ఆట మొదలెట్టారా అన్న అనుమానం కలుగుతోంది. ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ చెబుతున్నదాన్ని బట్టి.. ఏబీఎన్‌లో ప్రసారం అవుతున్న వీడియోలను బట్టి చూస్తే.. ఆర్కే సీఐడీని అడ్డుకున్నట్టు ఏమీ కనిపించదు. మరి అది ఎడిటెడ్ ఫుటేజ్‌ కాబట్టి దాన్ని నమ్మలేం..



మరో విషయం అసలు సీఐడీ సోదాలు జరుగుతుంటే.. తగుదునమ్మా అంటూ ఆ తతంగం అంతా షూట్ చేయడం ఏంటి.. అదీ అర్థం కాదు.. మరి ఆర్కే పై పెట్టి జీరో ఎఫ్‌ఐఆర్‌ నిజంగా ఆర్కేకు చుక్కలు చూపించడానికేనా.. లేక.. రొటీన్ చర్యల్లో భాగమా.. అన్నది కొన్నిరోజులైతే కానీ తెలియదు. అప్పటి వరకూ వెయిట్ అండ్ సీ తప్పదు మనకు.

మరింత సమాచారం తెలుసుకోండి: