ఆంద్రప్రదేశ్ రాజధానికి పునాది రాయి కూడా పడలేదు కానీ కృష్ణా తీర ప్రాంతంలో అద్దె ఇళ్లకు గిరాకీ పెరిగింది. మరీ ముఖ్యంగా విజయవాడలో ఇళ్ల అద్దెలు చుక్కలనంటున్నాయి. వేసవి రావడం, మరో రెండు నెలల్లో ఉద్యోగులు తప్పనిసరిగా ఇక్కడికే రావాల్సి ఉండడంతో ముందు జాగ్రత్తగా చాలామంది అప్పుడే ఇళ్ల వేట ప్రారంభించారు. దీంతో అద్దె ఇళ్లకు డిమాండు పెరగడమేగాక అద్దెలు హద్దులూ దాటుతున్నాయి. దీనికితోడు నగరంలో సాధారణంగా పన్నుల భారాలు పెరుగుతండడంతో యజమానులు అద్దెలు ఇష్టమొచ్చినట్లు పెంచేస్తున్నారు. గత ఏడాదికాలంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసమో, వ్యాపార అవకాశాల కోసమో లేదా పిల్లల చదువుల కోసమో వేలాది కుటుంబాలు నగర పరిసర ప్రాంతాలకు వలసొచ్చాయి. ఈ నేపథ్యంలో విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఇళ్లు అద్దెకు దొరకడం లేదు. దొరికినా ఆయా కుటుంబాల ఆర్థిక స్థితిగతుల(బడ్జెట్‌)కు తగ్గట్లుగా ఉండడం లేదు. డిమాండ్‌ ఉండడంతో అద్దె పెంచుకోవచ్చనే ఉద్దేశంతో ప్రస్తుతమున్న వారినీ ఖాళీ చేయిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో అవివాహితులు, విద్యార్థులకు మాత్రమే అద్దెకిస్తున్నారు. గతంలో ప్రధానంగా ఇది లబ్బీపేటకు మాత్రమే పరిమితమయితే ప్రస్తుతం నలుమూలకూ విస్తరించింది.


ఇదే సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విజయవాడ, గుంటూరులో అద్దె ఇళ్ల పరిస్థితిని శుక్రవారం శాసనమండలిలో ప్రస్తావించడం గమనార్హం. 'రాజధాని నేపథ్యంలో విజయవాడకు మారితే పిల్లల చదువులకు ఇబ్బందులు ఏర్పడతాయని, అక్కడ మౌలిక వసతుల్లేవని ఉద్యోగులంటున్నారు. త్వరలోనే ఉద్యోగులు రాజధాని ప్రాంతానికి వెళ్లాల్సి ఉంటుంది. వారికి సరిపోయిన విధంగా ఇళ్లులేవు' అని వ్యాఖ్యానించారు. 


విజయవాడలో అసలే సౌకర్యాలు తక్కువ... చాలా ప్రాంతాల్లో కనీసం బండి పార్కింగుకు కూడా సరైన స్తలం ఉండదు.... గట్టిగా రెండు అడుగుల వెడల్పు కూడా లేని మెట్లున్న ఇళ్లుంటాయి. వన్‌టౌన్‌, అయోధ్యనగర్‌, పడమట, కృష్ణలంక ప్రాంతాల్లో ఎటువంటి అధునాతన సౌకర్యాలూ లేకపోయినా రెండు గదులున్న ఇంటికి నెలకు రూ. 5000 నుండి 6000 వరకూ అద్దె డిమాండ్‌ చేస్తున్నారు. సత్యనారాయణపురం, ముత్యాలంపాడు ప్రాంతాల్లో మూడు గదులున్న ఇల్లు రూ. 8 వేలు పలుకుతోంది.  కొన్ని ప్రాంతాల్లో అపార్టుమెంట్లలో సింగిల్‌ బెడ్‌ రూమ్‌ రూ. 6 నుంచి 7 వేలు, డబుల్‌ బెడ్‌రూము రూ. 12 నుంచి 14 వేలు, త్రిబుల్‌ బెడ్‌ రూమ్‌కు రూ. 15 నుంచి 18 వేలకు పైగా వసూలు చేస్తున్నారు. కృష్ణలంక ప్రాంతాల్లో అద్దెలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇది అన్ని ప్రాంతాల్లోనూ ఒకే విధంగా ఉంటోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: