ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌పై విరుచుకుపడ్డారు. దేశానికి రాజధానిగా ఉన్నప్పటికీ.. న్యూఢిల్లీకి బడ్జెట్‌లో నిధులను కేటాయించలేదని  అరవింద్ కేజ్రీవాల్  వార్షిక బడ్జెట్‌పై విమర్శించారు.  మరోసారి ఢిల్లీవాసులపై కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ సవతితల్లి ప్రేమను తమపై ప్రదర్శించిందని కేజ్రీవాల్ మండిపడ్డారు. అంతేకాదు ఢిల్లీపై బడ్జెట్‌లో ఎలాంటి కేటాయింపులు లేకపోవడంపై ఢిల్లీ బీజేపీ నాయకులు ఈ సందర్బంగా ప్రజలకు ఏం సమాధానం చెబుతారని ఆయన ప్రశ్నించారు.

 

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్... నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం ముగిసిన కొద్దిసేపటికే ఆయన ట్విట్టర్‌లో స్పందించారు. త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా  బీజేపీకి ఢిల్లీ వాసులు ఏ కారణంతో ఓటు వేయాలని ప్రశ్నించారు. ఎన్నికలకు ముందే బీజేపీ ఢిల్లీ పట్ల వివక్షను ప్రదర్శిస్తోందని, ఇక ఎన్నికల తరువాత అధికారంలోకి వస్తే.. పరిస్థితి ఎలా ఉంటుందని, తన ఎన్నికల హామీలను నెరవేర్చగలదా? అని కేజ్రీవాల్ ప్రశ్నించారు.


ఎన్నికల ముంగిట్లో ఉన్నందున.. వాటిని దృష్టిలో పెట్టుకుని అయినా కేంద్ర ప్రభుత్వం ఢిల్లీపై వరాల జల్లు కురిపిస్తుందని సగటు ఢిల్లీ పౌరుడు ఆశించారని అన్నారు. ఢిల్లీ సంక్షేమానికి కొద్దో, గొప్పో నిధులను కేటాయిస్తుందని భావించారని చెప్పారు. వారి ఆశలను కేంద్ర ప్రభుత్వం నీరుగార్చిందని అన్నారు. ఢిల్లీవాసుల పట్ల బీజేపీకి ఎంత ప్రేమ ఉందనేది ఈ బడ్జెట్‌తో తేటతెల్లమైందని విమర్శించారు.

 

 పెద్ద ఎత్తున ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌కు నిధులను సమకూర్చుతుందని భావించామని, చివరికి మొండిచెయ్యి చూపిందని ఆరోపించారు. ఇదే అంశాన్ని తాము తాజాగా అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా జనంలోకి తీసుకెళ్తామని కేజ్రీవాల్ తెలిపారు. ఢిల్లీకి ఏమిచ్చారు? బీజేపీకి ఎందుకు ఓటు వెయ్యాలి.. ? అనే నినాదంపై ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేస్తామని అన్నారు. ఓడిపోతామని తెలిసే.. ఢిల్లీకి నిధులను మంజూరు చేయలేదని ఆయన ధ్వజమెత్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: