
మరోపక్క జయలలిత ఎక్కడైతే జీవించారో అదే పోయెస్ గార్డెన్‌లోనే తాను కూడా నివసించాలని శశికళ భావిస్తున్నారట. ఆమె నివాసం కోసం ఇప్పటికే 30 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో భారీ భవంతి నిర్మాణం జరుగుతోంది. అయితే జనవరి 27 లోపు ఈ భవన నిర్మాణం పూర్తయ్యే పరిస్థితులు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో చిన్నమ్మ జైలు నుంచి వచ్చి ఆ భవంతి నిర్మాణం పూర్తయ్యే వరకు టీ నగర్‌లోని ఓ ఇంట్లో ఉండనున్నట్టు తెలుస్తోంది. తమిళ నాడులో మరి కొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. అధికారంలో ఉన్న అన్నా డీఎంకే పూర్తి బలహీనంగా ఉంది.
బీజేపీ, అన్నా డీఎంకే పార్టీలు కలిసి ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉంది. మరోపక్క డీఎంకే పార్టీ అధికారంలోకి వచ్చేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తోంది. గత పార్లమెంటు ఎన్నికల్లో డీఎంకేకు మెజారటీ ఎంపీ సీట్లు వచ్చాయి. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లోనూ డీఎంకేకు ఎక్కువ సీట్లు రావొచ్చని, డీఎంకే ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మరి శశికళ జైలు నుంచి విడుదల అయిన తరువాత తమిళ రాజకీయాలపై ఏ మాత్రం ప్రభావం చూపిస్తారో ముందు ముందు తెలుస్తుంది.