యువతను దారి మళ్లించడంలో ఉగ్రవాద సంస్థలు విజయం సాగిస్తున్నాయని చెప్పాల్సి వస్తుంది. ఎక్కడ ఏ నేరం చేసినా ఇటీవల యువత ప్రధానంగా అందులో ప్రత్యక్ష భాగస్వాములు అవుతున్నారు. దానికి అనేక కారణాలు ఉండొచ్చు, వారిలో పేరుకుపోయిన అనేక నిరాశ నిస్పృహలు, భవిష్యత్తుపై అభద్రతా భావం, ప్రయత్నిస్తున్నప్పటికీ ఫలితాలు రాకపోవడం ఇవన్నీ నేటి యువతలో మానసికంగా కృంగిపోయేందుకు కారణాలుగా ఉన్నాయి. ఈ స్థితిలో ఉన్న వారి వద్దకు వెళ్లి వాళ్ళ మనసును తమవైపు తిప్పుకోవడంలో తీవ్రవాద సంస్థలు విజయం సాధిస్తున్నాయి. అలా వాళ్ళను స్వదేశానికే శత్రువును చేస్తున్నాయి. వారి బలహీన మనస్తత్వం వారికే కాదు, వాళ్ళ వాళ్లకు కూడా చెడు చేస్తుంది అనే స్పృహ కూడా ఆ యువతలో ఉండటం లేదు.

కళ్ళు మూసుకొని ఉగ్రభూతాలు ఏమి చెబితే అవి చేసేస్తూ ఉన్నారు. గతంలో యువత మనసుపై పడిన చిన్న చిన్న గాయాలను కావాలని పెద్దదిగా చేసి చూపిస్తూ, వారిలో సహజంగానే మనిషులపై, మతాలపై, వ్యవస్థపై ద్వేషాన్ని నూరిపోస్తూ వాళ్ళను ఆయా దేశాలలో తమకు అనుకూలంగా వాడుకుంటున్నారు తీవ్రవాద సంస్థలు. పెద్ద పెద్ద విషయాలు పట్టించుకుంటున్న ఆయా ప్రభుత్వాలు యువత వైపు చూడటం దాదాపు మానేస్తున్నారు. ఈ యువతలో ఎవరు ఉత్సాహంగా విజయాలు సాగిస్తున్నారో వాళ్ళను నెత్తిన పెట్టుకుంటూ మిగిలిన వారిని వాళ్ళ ఖర్మానికి వాళ్ళను వదిలేస్తున్నారు. అదే ఆయా యువత నిర్లక్ష్యంగా భావిస్తున్నారు, దానితో వేరే మార్గాలవైపు సులభంగా వెళ్తున్నారు.

ఒక్కో దేశంలో పరిస్థితులు గమనిస్తున్నప్పుడు, తరగతి గది గుర్తుకు వస్తుంది. నేటి విద్యావ్యవస్థలో మొదటి ర్యాంకు వచ్చిన వాడికి తప్ప మిగిలిన 99 మందికి పెద్దగా గుర్తింపు ఉండటంలేదు. ఆ ఒక్కడికే అన్నిటిని అందిస్తున్నారు ఆయా ప్రభుత్వాలు కూడా. ఇదే సమాజంలో యువత విషయంలోనూ జరుగుతుంది. ఎవరో కాలం కలిసి వచ్చి ఒకటి సాధిస్తాడు, వాడినే పట్టించుకుంటున్నారు; మిగిలిన వాళ్ళందరూ  పక్కన పెట్టబడుతున్నారు. ఇలాంటి వ్యవస్థలో యువతను దారి మళ్లించడం చాలా సులభం. అలా కాకుండా అందరికి స్వావలంబన కల్పించే విధానం తేవడం ప్రభుత్వం బాధ్యతగా స్వీకరించాలి. అన్నిటిని ప్రభుత్వం చేయలేకపోవచ్చు, కానీ ఎవరు ముష్కరులకు ఎక్కువగా చిక్కుతున్నారో వాళ్లపట్ల జాగర్తగా ఉండాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఉంది. కనీస వేతన పరిధిలోకైనా సరే, అందరికి ఉపాధి కల్పించే స్థానిక కుటీర పరిశ్రమలు పెట్టాలి. అందులో దేశంలో పౌరులకు కావాల్సిన వస్తువులను తయారు చేయించాలి, వాటిని ఆయా వినియోగదారులకు చేర్చాలి. ఇలాంటి పనులలో యువతను భాగస్వాములను చేయాలి. తద్వారా కనీసం యువతలో వందశాతం ఉద్యోగ కల్పన సాధ్యం అవుతుంది. అప్పుడు వాళ్ళను నూతన ఉత్సాహాం వస్తుంది, దానితోపాటుగా కొత్తగా ఆలోచనలు మొదలవుతాయి. చేసేపనిలోనే కొత్తగా చేస్తారు. మరింత ఆకర్షణీయంగా, కొత్తకొత్త ఆవిష్కరణలు వెలుగు చూస్తాయి. ఇవన్నీ చూడటానికి వేయికళ్ళు సరిపోవు.  ఈ స్థాయి రావాలంటే, ప్రభుత్వాలు చొరవ తీసుకోక తప్పదు. భారతదేశంలో 52 శాతం యువత నీరుగారిపోతే, తరం నాశనం అయిపోయినట్టే. అదే 52 శాతం వనరులను సరిగ్గా వినియోగించుకుంటే, నాడు జపాన్ మాదిరే త్వరితగతిన అభివృద్ధి వైపు అడుగు పడతాయి. ఇది అందరి సంకల్పం అయినప్పుడు, ఏ ముష్కరులు భారత్ వైపు కన్నెత్తి చూడలేరు. రాజకీయాలు తప్ప దేశంలో యువతను పట్టించుకునే ఆసక్తి నేటి ప్రభుత్వాలకు ఉన్నదా అన్నదే ఇక్కడ పెద్ద ప్రశ్న.

మరింత సమాచారం తెలుసుకోండి: