చార్మినార్, గోల్కొండ.. ఇలాంటి ప్రదేశాల సందర్శనకు ఎంట్రీ ఫీజు ఉంటుంది. అయితే ఈరోజు నుంచి ఆ ఫీజు లేదని కేంద్రం స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా చారిత్రక కట్టడాలు, చారిత్రక నేపథ్యమున్న ప్రాంతాలకు ఎంట్రీ ఫీజు లేకుండా చేస్తున్నట్టు ప్రకటించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఈనెల 5 నుంచి 15వతేదీ వరకు మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. హైదరాబాద్ లో గోల్కొండ, చార్మినార్ కు ప్రవేశ రుసుము లేకుండానే పర్యాటకుల్ని అనుమతిస్తారు. గతంలో భారతీయులకు ఎంట్రీ ఫీజు ఒకలా, విదేశీయులకు మరోలా ఉండేది. ఇప్పుడు విదేశీయులకు కూడా ఎంట్రీ ఫ్రీ అని స్పష్టం చేశారు. ఈ అవకాశం కేవలం 10రోజులు మాత్రమే అందుబాటులో ఉంటుందని అన్నారు.

భారత 75వ స్వాతంత్ర్య దినోత్సవం, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో భాగంగా ఈ అవకాశం కల్పిస్తున్నట్టు ప్రకటించింది కేంద్రం. భారత పురావస్తు శాఖ ఆధ్వర్యంలో ఉన్న ఇతర అన్ని స్మారక చిహ్నాలు, ప్రదేశాలకు పర్యాటకులను, సందర్శకులను ఉచితంగా అనుమతిచ్చేందుకు కేంద్రం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం భారత పురావస్తు శాఖ ఆధ్వర్యంలో 3,400 ప్రాంతాల్లో సందర్శకులను అనుమతిస్తున్నారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ సందర్శక ప్రాంతాలున్నాయి. వాటిల్లో ఆగస్టు 5 నుంచి 15వ తేదీ వరకు అందరికీ ఉచిత ప్రవేశం అని కిషన్ రెడ్డి ప్రకటించారు.

తెలంగాణ విషయానికొస్తే.. రాష్ట్రంలోని హైదరాబాద్, వరంగల్ జిల్లాల్లో నాలుగు స్మారక చిహ్నాలు సందర్శనీయ ప్రాంతాలుగా ఉన్నాయి. వాటిలో ఆగ‌స్ట్ 5 నుంచి 15వ తేదీ వ‌ర‌కు ఉచితంగా ప్రవేశం కల్పిస్తున్నారు. ఈ జాబితాలో తెలంగాణ నుంచి చార్మినార్, గోల్కొండ కోట, వేయి స్తంభాల గుడి, వరంగల్ కోట, పిల్లల మర్రి, రామప్ప ఆలయం కూడా ఉన్నాయి. ఆయా ప్రాంతాలను సందర్శించాలంటే ఇప్పటి వరకు రుసుము వసూలు చేసేవారు. కానీ ఇప్పుడు ఉచితంగా ఆ అవకాశం కేంద్రం కల్పిస్తోంది. ఆజాదీకా అమృత్ మహోత్సవ్ ని ప్రతిష్టాత్మకంగా చేపట్టింది కేంద్రం. రెండు వారాలపాటు ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: