జగన్మోహన్ రెడ్డి నీతిమంతుడా లేకపోతే అవినీతిపరుడా అన్న విషయం తేల్చాలని చేగొండి హరిరామజోగయ్యకు అనిపించింది. అందుకని జగన్ పై నమోదైన కేసులన్నింటినీ వెంటనే విచారణజరిపి తీర్పులు చెప్పాలని కోరుతున్నారు. ఈ మేరకు పెండింగ్ లో ఉన్న కేసుల విచారణ పూర్తిచేసి తీర్పులు చెప్పేలా ఆదేశాలు ఇచ్చేట్లుగా సీబీఐ కోర్టును ఆదేశించాలని తెలంగాణా హైకోర్టుకు జోగయ్య లేఖ రాయబోతున్నారు.

జగన్ కు ఓటు వేయాలా ? వద్దా అని జనాలు తేల్చుకోవాలంటే ముందు జగన్ నీతిమంతుడా లేకపోతే అవినీతిపరుడా అన్నది తేలాలని జోగయ్య పెద్ద లాజిక్ బయటకు తీశారు. జగన్ పైన కేసులను పదేళ్ళక్రితమే నమోచేసినా ఇంతవరకు పూర్తిచేయకపోటంపై తీవ్ర అసహనాన్ని వ్యక్తంచేశారు. రాజకీయ నేతలపై నమోదైన కేసులను తొందరగా పూర్తిచేసి తీర్పులివ్వాలని సుప్రింకోర్టు డైరెక్షన్ ఉన్న విషయాన్ని జోగయ్య గుర్తుచేయబోతున్నారట.

నేతలపైన కేసులను వెంటనే విచారించాలని గైడ్ లెన్స్ ఉన్నా కేసుల విచారణకు దశాబ్దాలు ఎందుకు పడుతోందో అర్ధంకావటంలేదని జోగయ్య చెప్పారు. రాజకీయనేతలపై నమోదైన కేసుల్లో రోజువారి విచారణ చేయటంలేదన్నారు. రోజువారి విచారణ చేస్తే చాలా కేసులు ఈపాటికే తేలిపోయేవని జోగయ్య అభిప్రాయపడ్డారు. నేరచరితులు ఎన్నికల్లో పోటీచేయాలా ? వద్దా అన్నది కేసుల విచారణ పూర్తయితే కానీ తేలదన్నారు. కేసుల విచారణ పూర్తియి తీర్పొస్తేనే జగన్ పోటీచేయాలా వద్దా అన్నది తేలిపోతుందన్నారు.

నీతిమంతులైన నేతలను ఎన్నుకునే హక్కు ఓటర్లకు ఉందన్న విషయాన్ని జోగయ్య తన లేఖలో హైకోర్టుకు గుర్తుచేయబోతున్నారు. మొత్తానికి 2024 ఎన్నికలు రాబోతున్న సమయంలో జగన్ మీద విచారణ జరుగుతున్న కేసులు జోగయ్యకు గుర్తుకురావటం సంతోషమనే చెప్పాలి. కాకపోతే ఓ విషయం ఏమిటంటే జగన్ పైన విచారణ జరుగుతున్న కేసులతో జోగయ్యకు ఎలాంటి సంబంధంలేదు. అయితే జగన్ నీతిమంతుడా లేకపోతే అవినీతిపరుడా అన్న విషయం ప్రపంచానికి తెలియటం కూడా చాలా అవసరమే. జోగయ్య కోరుతున్నట్లు కాకపోయినా రాజకీయాల్లో నేరస్తులకు చోటుండకూడదన్నది మాత్రం వాస్తవం. అందుకని అయినా జోగయ్య కోరుతున్నట్లు జగన్ పైన ఉన్న కేసులను కోర్టు తొందరగా తేల్చేస్తే మంచిదే.

మరింత సమాచారం తెలుసుకోండి: