తమిళ సినిమా ‘థలపతి’ విజయ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పార్టీ కీలక భూమిక పోషించనుందన్న ప్రచారం బలంగా వినిపిస్తోంది. ఈ క్రమంలో విజయ్ నిర్వహించిన రాజకీయ రోడ్‌ షోలు పెద్ద ఎత్తున అభిమానులను ఆకర్షిస్తున్నాయి. తాజాగా కరూర్ నగరంలో ఆయన రోడ్ షో సందర్భంగా భారీ సంఖ్యలో అభిమానులు హాజరయ్యారు. పదివేల మందిని మాత్రమే అంచనా వేసినా.. లక్షలాది మంది గుమిగూడటంతో తీవ్ర తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటనలో 38 మంది దుర్మరణం పాలవ్వగా, మరికొందరు తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు. దీంతో ఒక్కసారిగా “కరూర్ సిటీ ఎక్కడుంది? ఈ నగరానికి ఉన్న ప్రత్యేకత ఏమిటి?” అన్న చర్చ మొదలైంది.


తమిళనాడు మధ్యలోని కీలక పట్టణం .. కరూర్ నగరం తమిళనాడు రాష్ట్ర మధ్యభాగంలో ఉంది. ఇది కరూర్ జిల్లాకు కేంద్రం. రాష్ట్ర రాజధాని చెన్నై నుంచి రోడ్డు మార్గంలో సుమారు 350-370 కి.మీ. దూరంలో ఉంది. బస్సు లేదా కారులో ప్రయాణిస్తే దాదాపు 7–8 గంటల సమయం పడుతుంది. 2011 లెక్కల ప్రకారం కరూర్ జనాభా 2.34 లక్షలు కాగా, ప్రస్తుతానికి సుమారు 4.5 లక్షలకు చేరిందని చెబుతున్నారు. నగర విస్తీర్ణం 30.96 చదరపు కిలోమీటర్లు. జిల్లా మొత్తం జనాభాలో దాదాపు 10% మంది కరూర్ సిటీలోనే నివసిస్తున్నారు.



రవాణా సౌకర్యాలు .. కరూర్ రైల్వే స్టేషన్ సేలం డివిజన్‌లోని ఒక ‘ఏ’ గ్రేడ్ స్టేషన్. దాదాపు అన్ని ప్రధాన రైళ్లు ఇక్కడ ఆగుతాయి. రోడ్డు మార్గంలో చెన్నై, బెంగళూరు, తిరువనంతపురం, తిరుపతి, నాగర్ కోయిల్ వంటి ప్రధాన నగరాలకు కరూర్ నుండి సులభంగా చేరుకోవచ్చు. అయితే కరూర్‌కి నేరుగా విమాన సౌకర్యం లేదు. ఈ నగరానికి అత్యంత దగ్గరగా ఉన్న విమానాశ్రయం తిరుచిరాపల్లి (78 కి.మీ.). అలాగే కోయంబత్తూరు ఎయిర్ పోర్టు (121 కి.మీ.), సేలం ఎయిర్ పోర్టు (116 కి.మీ.)లు కూడా సమీపంలో ఉన్నాయి.



కరూర్ ప్రత్యేకత .. కరూర్ నగరం చేనేత వస్త్రాలకు, పారిశ్రామిక కేంద్రంగా ప్రసిద్ధి చెందింది. ఈ ప్రాంతంలో తయారయ్యే వస్త్ర ఉత్పత్తులు దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగా కూడా పేరుగాంచాయి. చరిత్రపరంగా చూస్తే పురాతన కాలంలో కరూర్ రత్నాల తయారీకి కూడా కేంద్రంగా నిలిచింది. అదేకాకుండా, తెలుగు వారికి బాగా పరిచయమైన కరూర్ వైశ్యా బ్యాంక్ కూడా ఇక్కడే ఆరంభమైంది. దీంతో ఆర్థికంగా కూడా కరూర్ ఒక పెద్ద వ్యాపార కేంద్రంగా పేరు తెచ్చుకుంది.

 

ఇప్పుడు దేశం మొత్తం దృష్టి ..  ఇప్పటి వరకు పారిశ్రామిక, వ్యాపార కేంద్రంగా మాత్రమే పేరు గాంచిన కరూర్.. విజయ్ రోడ్ షోలో జరిగిన విషాదకర సంఘటనతో ఇప్పుడు దేశం మొత్తం దృష్టిని ఆకర్షిస్తోంది. ఒకవైపు తమిళ రాజకీయాల్లో విజయ్ అడుగులు వేస్తుండగా, మరోవైపు ఆయన నిర్వహించిన సభలో ప్రాణాలు కోల్పోయిన ఘటన రాష్ట్రానికే కాకుండా దేశాన్నే కుదిపేసింది. మొత్తం మీద.. చేనేత వస్త్రాలు, వ్యాపార కేంద్రం, చరిత్రాత్మక ప్రాధాన్యం కలిగిన కరూర్ ఇప్పుడు ఒక రాజకీయ హాట్‌స్పాట్‌గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: