హిందూ పురాణమైన మహాభారతంలో ఉన్న ఒక పాత్ర పేరు సంజయుడు. ధృతరాష్ట్రుని కొలువులో సలహాదారు, రథసారథి. కురుక్షేత్రంలో ప్రాణాలతో మిగిలినవాళ్ళలో ఇతనొకడు. పాండవుల అజ్ఞాత వాసం ముగిసిన సందర్భంలో ధృతరాష్ట్రుని తరుపున రాయబారిగా పాందవుల దగ్గరకు వెళ్లి యుద్ధము వద్దని మంచి మాటలతో ఒప్పించాలని చూసాడు. అయినా యుద్ధం మొదలవుతుంది. అయితే మహాభారత యుద్ధ సమయంలో కన్నులు లేని కౌరవరాజు ధృతరాష్ట్రునికి, సంజయుడు తన దివ్యదృష్టి ద్వారా అక్కడ జరుగుతున్నదంతా వివరించి చెబుతాడు.


అంతే కాకుండా ధృతరాష్ట్రుని నూరుగురు కుమారులు ఆ యుద్ధంలో ఎలా చనిపోయారో ఆయనకు వివరించాల్సి వస్తుంది. ఈ వరం సంజయుడికి, వ్యాసుడు అనుగ్రహిస్తాడు.. మహాభారతం లో అధర్మ పక్షంలో ఉంటూ తమ పక్షం వారు అధర్మం చేస్తున్నారని అందువల్ల వినాశనం తప్పదని తమవారికే చెప్పగలిగిన ధైర్యశాలి సంజయుడు. అసలు అధర్మాచరణకు మూలకొమ్మయైన ధృతరాష్ట్రునికీ తాము చేస్తున్నది మహా పాపమని తెలుసు. కానీ ఎంత తెలిసున్ననూ పుత్ర వ్యామోహంతోనో, ప్రతిజ్ఞ బంధంతోనో, స్వధర్మాచరణ అనే ముడితో చాలామంది అధర్మపక్షంలోనే ఉండిపోయారు.


ఎక్కడైనా సరే ఏ అవస్థ లోనైనా సరే ధర్మాన్ని విజయలక్ష్మి వరిస్తుందనేది సత్యం. ఇక ఎన్ని ప్రతికూల పరిస్థితులు చుట్టుముట్టినా ధర్మం తప్పకుండా పనులు చేస్తూ అసత్యాన్ని పలకకుండా ఉండడమే నేర్పరితనం. ఆ నేర్పరితనంలో సంజయుడు దిట్ట. ఇకపోతే కురు పాండవుల్లోని ఇరుపక్షాల బలాలు బలహీనతలు సమగ్రంగా తెలిసినవాడు సంజయుడు. అందువల్ల ధృతరాష్ట్రుడు, పాండవుల దగ్గరికి రాయబారానికి పంపినపుడు వారి బుద్ధి వైశిష్ట్యాన్ని పొగుడుతునే ధర్మరాజుని నీవు పుణ్యశాలివీ, రక్తపుటేరులతో పండిన అన్నాన్ని తినలేవు ఐనా నీకు పరమశివుని దగ్గర అస్త్రాలను సాధించిన వీరాధివీరులైన తమ్ములున్నారు అనీ సామంతో లొంగదీసుకునే ప్రయత్నం చేసాడు.


అదే సమయంలో కౌరవుల్లో మహాభయాంకరులైన యుద్ధ పిపాసులైన భీష్మ ద్రోణ కృపాచార్యులతో పాటుగా దుశ్శాసనాది వీరులు మహా పరాక్రమవంతులైన వారి సంతానం ఉన్నారని చెప్పి వారిని ఎదిరించటానికి పరమశివుడు కూడా సంశయిస్తాడని అంటాడు. అంటే మీరు ఉత్తములని చెప్తూనే మీ ఎదుటివారు సైతం సామాన్యులు కారు, వారిని జయించడానికి ఎవరైనా వెనుకంజ వేస్తారనే విషయాన్ని వెల్లడిస్తాడు. ఇలా ఎన్నో సామదానదండోపాయాలను ఉపయోగించి వారిని యుద్ధ విముఖులను చేయడానికి తన వంతు ప్రయత్నం చేస్తాడు. అయితే చివరకు సంజయ రాయబారం శుష్కప్రియాలు శూన్యహస్తాలు మిగిల్చిందన్నది వాస్తవం. కాగా ఇలాంటివి నిత్య జీవితంలో ఆచరణలో పెడితే అన్నింటా విజయం వరిస్తుంది. అంతేకాదు నిజం మాట్లాడడమెలాగో, నిష్ఠూరమైననూ అధర్మం నుంచి ఎలా పక్కకు తప్పుకోవాలో, ఒకవేళ అక్కడే ఉన్నా అధర్మపు ఛాయ అంటకుండా ఎలా ఉండాలో తెల్సుకోవచ్చు..


మరింత సమాచారం తెలుసుకోండి: