గతంలో నిజానికి మన జన్మభూమి కమిటీల్లో లంచం ఇస్తే పెన్షన్.. లేకుంటే ఇవ్వని పరిస్థితులను చాలా వరకు ప్రజలు చూశారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే, బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ మల్లాది విష్ణు అన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 55వ డివిజన్‌లో నిర్వహించిన ‘ఇంటి వద్దకే లబ్దిదారులకు పెన్షన్’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. 

 

లబ్దిదారులకు పెన్షన్లు అందచేసిన అనంతరం మల్లాది విష్ణు మీడియాతో మాట్లాడుతూ.. గతంలో ప్రతి నెల 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు పింఛన్లు ఇచ్చేవారని ఆయన అన్నారు. ఈ వ్యవస్థను సమూలంగా మార్చాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయించారని ఎమ్మెల్యే విష్ణు పేర్కొన్నారు. రోజులకొలది పింఛన్‌దారులు తిరిగే బాధకు సీఎం జగన్‌ స్వస్థి పలికారని ఆయన చెప్పారు. గ్రామ వాలంటీర్ల ద్వారా పింఛన్లు డోర్ డెలివరీ చేసేలా చర్యలు చేపట్టామని ఆయన అన్నారు. ప్రజలకు మేలైన సేవ చేసేందుకు సీఎం జగన్‌ సచివాలయ వ్యవస్థను తెచ్చారని మల్లాది విష్ణు గుర్తుచేశారు.

 

సెంట్రల్‌ నియోజకవర్గంలో 55వ డివిజన్‌లో 120 మంది కొత్త పింఛన్ లబ్దిదారులుగా ఎంపికయ్యారని ఆయన వెల్లడించారు. అర్హులైన వారిని ప్రభుత్వం విస్మరించదని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో 53 లక్షల పెన్షన్లు ఇస్తున్నామని తెలిపారు. సాంకేతిక లోపాల వల్ల పెన్షన్లు ఆగితే ఆందోళన చెందవద్దని చెప్పారు. ప్రజలకు సేవ చేయడం కోసం నూతన సచివాలయ వ్యవస్థకు సీఎం జగన్‌ శ్రీకారం చుట్టారని విష్ణు గుర్తుచేశారు. 

 

సీఎం జగన్‌ పాలనలో ఇంటి వద్దకే లబ్ధిదారులకు పింఛన్లు వచ్చేలా చర్యలు చేపట్టారని ఆయన అన్నారు.  టీడీపీ హయంలో 58వ డివిజన్‌లో ఒంటరి మహిళా పింఛన్ల పేరుతో అవకతవకలకు పాల్పడ్డారని ఆయన మండిపడ్డారు. వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. పారదర్శక పాలనలో అన్ని పధకాలకు కేరాఫ్‌ అడ్రస్‌ సచివాలయమని మల్లాది విష్ణు అన్నారు.
 

మరింత సమాచారం తెలుసుకోండి: