
తెలుగుదేశం పార్టీకి చెందిన ఇద్దరు కేంద్ర మంత్రుల మధ్య విభేదాలు ఇప్పుడు ఆ పార్టీలో చర్చనీయాంశంగా మారాయి. కేంద్ర మంత్రివర్గంలో తెలుగుదేశం పార్టీ నుంచి మంత్రులుగా ఉన్న అశోక్ గజపతిరాజు, సుజనా చౌదరి మధ్య రోజు రోజుకూ అంతరం పెరుగుతున్నట్లు రాజకీయవర్గాల్లో వినిపిస్తోంది. టీడీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు, కేంద్ర సహాయ మంత్రి అయిన సుజనా చౌదరి ఆధిపత్య ధోరణి ప్రదర్శిస్తున్నారని మరో కేంద్రమంత్రి, టీడీపీ సీనియర్ నేత అశోక్ కొంతకాలంగా అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. శుక్రవారం చంద్రబాబు ఢిల్లీ పర్యటన సందర్భంగా ఈ ఇద్దరి మధ్య ఉన్న అగాధం కనిపించిందని పలువురు పేర్కొంటున్నారు. చంద్రబాబు అండతోనే సుజనా చౌదరి అశోక్ ను కాదని వ్యవహరిస్తున్నారని అంటున్నారు. ఆ కారణంగా అశోక్ కూడా అంటీముట్టనట్లుగానే ుంటున్నారని సమాచారం. కాగా సుజనా వ్యవహారశైలిపై పార్టీకి చెందిన మిగతా ఎంపీలు కూడా ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది.
తెలుగుదేశం పార్టీకి చెందిన ఇద్దరు
అశోక్ టీడీపీలో చాలా సీనియర్... ఆయన చంద్రబాబు కంటే ముందు నుంచే టీడీపీలో ఉన్నారు. ఎన్టీఆర్ 1982లో పార్టీ పెట్టినప్పుడు ఆయన వెంటున్నవారిలో అశోక్ కూడా ఒకరు. ప్రస్తుతం పొలిట్‌బ్యూరో సభ్యునిగా ఉన్న ఆయనది ప్రత్యక్ష ఎన్నికల్లోనూ తిరుగులేని రికార్డు. ఒక్కసారి తప్ప పోటీ చేసిన ప్రతిసారీ గెలిచారు. మోడీ తొలి కేబినెట్ లోనే ఆయనకు పదవి దక్కింది.
రాజ్యసభ
మరోవైపు సుజనా చౌదరి 2010లో రాజ్యసభ సభ్యుడు కాకముందు ఎవరికీ పెద్దగా తెలియదు. ఆయనకు పార్టీలో ఎప్పుడు సభ్యత్వం ఇచ్చారో, అప్పటి వరకు అసలు ఉందో లేదో కూడా తెలీదని ఆ పార్టీ వారే అంటుంటారు. కేవలం వ్యాపార, ఆర్థిక వ్యవహారాలతోనే ఆయన చంద్రబాబుకు సన్నిహితుడిగా మారి పార్టీలో ఎదిగారని చెబుతారు. తొలిసారి రాజ్యసభ సభ్యుడైన సుజనాను చంద్రబాబు ఏకంగా టీడీపీ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడిని చేశారు. మోడీ రెండోసారి మంత్రివర్గాన్ని విస్తరించినప్పుడు సహాయ మంత్రిని చేశారు.
పార్టీ ఫ్లోర్ లీడర్లు సీఎం రమేష్
సుజనా తీరుపై టీడీపీ ఎంపీల్లో చాలాకాలంగా అసంతృప్తి ఉంది. రెండుసార్లు ఎంపిగా, రాష్ట్ర మంత్రిగా పని చేసిన రాయలసీమకు చెందిన బీసీ నేత నిమ్మల కిష్టప్ప... ఎస్సీ వర్గానికి చెందిన సీనియర్ నేత శివప్రసాద్‌ను కాదని సుజనాకు మంత్రిపదవి ఇప్పించడంతో వారు కూడా గుర్రుగా ఉన్నారు. రాష్ట్రానికి నిధులు.. ప్రత్యేక హోదా.. ప్యాకేజీ వంటి అంశాల్లో సుజనా అంతా తానే అన్నట్లుగా వ్యవహరిస్తూ ఎవరినీ పిలవకుండా వ్యవహారం నడిపిస్తున్నారని ఎంపీలు గుసగుసలాడుతున్నారు. ఈ విషయంలో రాజ్యసభ, లోక్‌సభల్లో పార్టీ ఫ్లోర్ లీడర్లు సీఎం రమేష్, తోట నరసింహం కూడా అసహనం చెందుతున్నట్లు సమాచారం. ముఖ్యమంత్రి ఢిల్లీలో పర్యటించినప్పుడు పార్టీ ఎంపీలు ఆయన పక్కన ఉండటం ఆనవా యితీ. కాగా సుజనా ఒక్కరే చంద్రబాబు పక్కన కనిపిస్తున్నారు... చివరికి ఢిల్లీలో ఏపి ప్రభుత్వ ప్రతినిధి కంభంపాటి రామ్మోహనరావును సైతం సుజనా అంతగా పట్టించుకోవట్లేదని సమాచారం. మొత్తానికి సుజనా తీరుపై అంతటా వ్యతిరేకత వ్యక్తమవుతున్న విషయం బయటపడుతోంది.