
మైలవరం వ్యాప్తంగా వైసీపీ లో రాజకీయ పరిస్థితులపై ఆరా తీశారు. జిల్లా పార్టీ ఇంఛార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఈ నేపథ్యంలో కొన్ని కీలక ఆదేశాలు జారీ చేశారు. దీంతో మైలవరం వైసీపీ లో కొనసాగుతున్న " టీ కప్పు" లో తుఫాను ప్రస్తుతానికి బలహీనపడింది.. దీనికి కార్యరూపం తీసుకొస్తూ మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ తండ్రి జోగి మోహనరావును పరామర్శించి.. వర్గ భేదాలకు చెక్ పెట్టారు. అనారోగ్యం కారణంగా విజయవాడ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న జోగి మోహనరావును ఆయన రెండవ కుమారుడు కొండపల్లి మున్సిపాలిటీ 19 వ డివిజన్ కౌన్సిలర్ జోగి రాముతో కలిసి వెళ్ళారు. ఈ సన్నివేశం చూసిన మైలవరం నియోజకవర్గ ప్రజలు, రాజకీయ ప్రముఖులు, వైసీపీ శ్రేణులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేసిన పరిస్థితి. ఇక ఇదే అంశంపై స్థానిక వైసీపీ నేతలు మాట్లాడుతూ మైలవరం నియోజకవర్గంలో ఉన్నది ఒకటే వర్గమని అది జగన్మోహన్ రెడ్డి వర్గమని చెప్పుకొచ్చారు. రాజకీయ పార్టీలలో మనస్పర్థలు, అలకలు ఎన్నో రోజులు ఉండవని... భవిష్యత్ లో కలిసి కట్టుగా మరింత బలోపేతం అవుతామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మైలవరం నియోజకవర్గ అధికార వైసీపీలో కొనసాగుతున్న అనిశ్చితిని రాజకీయంగా వాడుకోవడం కోసం కాచుకొని కూర్చున్న ప్రతిపక్షాలకు నిన్న జరిగిన రాజకీయ పరిణామాలు ఎలాంటి సంకేతాన్ని ఇచ్చాయి అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.