తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఇటీవల కొన్నేళ్ల క్రితం డ్రగ్స్ అంశం కలకలం అందరినీ భారీ షాక్ కి గురి చేసిన విషయం తెలిసిందే. అనంతరం డ్రగ్స్ దందాలో కీలక సూత్రధారి అయిన కెల్విన్ ని అరెస్ట్ చేసిన పోలీసులు, అతడిచ్చిన సమాచారం మేరకు పలువురు టాలీవుడ్ కి చెందిన సినిమా ప్రముఖులు సైతం ఈ డ్రగ్స్ తీసుకున్నారని సమాచారం అందడంతో అప్పట్లో పలువురు నటీనటుల్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తో పాటు ఎక్సయిజ్ ఎన్ఫోర్స్మెంట్ వారు కూడా పిలిపించి విచారించడం జరిగింది.

ఇటీవల దీనికి సంబంధించి ఈడీ పూర్తిగా దర్యాప్తు చేస్తోంది. అయితే ఈ కేసుని కేంద్ర దర్యాప్తు సంస్థలకు అప్పగించాలని ఇటీవల కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి గతంలో దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం విచారణ సందర్భంలో తాజాగా ఈ కేసులో డిజిటల్ మనీ లావాదేవీల విషయం తెరపైకి వచ్చింది. దానితో కెల్విన్ డ్రగ్స్ ని సౌత్ ఆఫ్రికా నుండి తీసుకువచ్చిన సందర్భంలో అక్కడి వారికి తాను పంపిన డబ్బు తాలూకు డిజిటల్ లావాదేవిలని పరిశీలించాలని నిర్ణయించిన న్యాయస్థానం వాటిని పరిలీలించి నిజానిజాలు నిగ్గుతేల్చాల్సిందిగా ఈడీని ఆదేశించింది.

అయితే ఈ కేసుకి సంబంధించి అభియోగపత్రాలు, ఎఫ్ ఐ ఆర్ కాపీలు మాత్రమే ఎక్సయిజ్ ఎన్ఫోర్స్మెంట్ వారు తమకు అప్పగించారని ఈడీ అధికారులు చెప్పడంతో న్యాయస్థానం వెంటనే కెల్విన్ తాలుకు డిజిటల్ లావాదేవీల వివరాలను ఈడీకి సమర్పించాలని ఆదేశించింది. అసలు విషయం ఏమిటంటే, కెల్విన్ కి సంబంధించిన డిజిటల్ లావాదేవీల లిస్ట్ కనుక బయటకు వస్తే పలువురు సినిమా ప్రముఖులు సైతం ఇందులో ఉన్నట్లు తేలే అవకాశాలు లేకపోలేదని, అయితే పూర్తి స్థాయిలో అసలు ఈ కేసుతో సినిమా ప్రముఖులకి సంబంధం ఉందా లేదా అనేది తెలియాలి అంటే మాత్రం ఆ డిజిటల్ లావాదేవీలని ఈడీ పరిశీలించిన అనంతరం తేటతెల్లం అవుతుందని సమాచారం. మరి ఈ కేసు రాబోయే రోజుల్లో ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: