
హైదరాబాద్‌లో ఉమ్మడి ఏపీ హైకోర్టు రిటైర్డ్ జస్టిస్, అఖిల భారత బీసీ ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు జస్టిస్ ఈశ్వరయ్య మీడియాతో మట్లాడుతూ..న్యాయపాలన, న్యాయవ్యవస్థపై తనకు అపారమైన గౌరవం, విశ్వాసం ఉందని వెల్లడించారు. సామాజిక న్యాయం కోసం పాటుపడే తాను బాధల్లో ఉన్న మరో బలహీనవర్గాల జడ్జితో మాట్లాడిన సంభాషణలను ట్యాంపరింగ్ చేసి, వాటిని ఎడిటింగ్ చేసి ప్రసారం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. న్యాయ పాలనకు వ్యతిరేకంగా తాను మాట్లాడినట్టు ఆంధ్రజ్యోతి చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన న్యాయవాదులకు జడ్జి పదవుల్లో అన్యాయం జరుగుతున్నదంటూ బహిరంగంగానే పోరాడుతున్నానని గుర్తుచేశారు.
తన సంభాషణలకు వక్రభాష్యం చెప్తూ..సామాజిక న్యాయం కోసం తాను చేస్తున్న కృషి, ఉద్యమాలు ఎలాంటి పదవులను ఆశించి గానీ, పాలకుల మెప్పుకోసం కానీ చేయలేదని.. బలహీన వర్గాల ఉన్నతి కోసం చేసినవేనని ఈశ్వరయ్య తెలిపారు. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి అన్నిఆధారాలు తనవద్ద ఉన్నాయని, తన వ్యాఖ్యలను పూర్తిగా వినిపించకుండా ఆంధ్రజ్యోతి జాగ్రత్తపడిందని పేర్కొన్నారు. ఆంధ్రజ్యోతితో కలిసి ఓ పార్టీ నాయకులు తనకు దురుద్దేశాలను ఆపాదిస్తున్నారని విమర్శించారు. ఆ పత్రిక ఓ రాజకీయ పార్టీ ఎజెండాను మోస్తూ వారికి అనుగుణంగా వ్యవహరిస్తున్నదని తెలిపారు. ఆంధ్రజ్యోతి దీనిని ప్రస్తుతం తాను నిర్వహిస్తున్న ఏపీ ఉన్నత విద్యా రెగ్యులేటరీ కమిషన్ మొత్తానికి అంటగట్టే ప్రయత్నం చేస్తున్నదని విమర్శించారు. కమిషన్ చైర్మన్ పదవికి కానీ, ఏపీ ప్రభుత్వానికి కానీ తన సంభాషణలతో ఎలాంటి సంబంధం లేదని.. వ్యక్తిగత హోదాలో ఓ జడ్జిని అనునయించడానికి మాత్రమే మాట్లాడానని పేర్కొన్నారు.