సంస్కృత విశ్వ‌విద్యాల‌యంలో అన్నమయ్య పీఠం

      పదకవితా పితామహుడు  తాళ్లపాక అన్నమాచార్యుల సంకీర్త‌న‌ల‌ను మరింత జనబాహుళ్యం లోనికి తీసుకు వెళ్లేందుకు తిరుమల తిరుపతి దేవస్థాం మరో అడుగు ముందుకు వేస్తోంది.  ఇప్పటికే  టిటిడి ఆధ్వర్యంలో అన్నమాచార్య ప్రాజెక్టు పేరున ఒక సంస్థ ఉంది. ఈ ప్రాజెక్టులో వందలాది మంది కళాకారులున్నారు. ఏదైనా దేవస్థానంలో సాంస్కృతి కార్యక్రమాలు ఏర్పాటు చేయాలను కుంటే  అన్నమాచార్య ప్రాజెక్టుకు లేఖ ద్వారా తెలియ జేస్తే కళాకారులు వచ్చి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇదంతా ఉచితంగా నే టిటిడి అందిస్తోంది.
తిరుపతిలో అన్నమయ్య పీఠం
అన్నమాచార్యుడిపై నిరంత‌రం ప‌రిశోధ‌న‌లు నిర్వ‌హించేందుకు తిరుప‌తిలోని కేంద్రీయ సంస్కృత విశ్వ‌విద్యాల‌యంలో " అన్న‌మ‌య్య పీఠం " ఏర్పాటుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని తిరుమల తిరుపతి దేవస్తానం యోచిస్తోంది. టిటిడి ఈవో డాక్ట‌ర్ కె.ఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి ఈ దిశగా చర్యలు తీసుకోవాలని అధికారుల‌ను ఆదేశించారు. సంస్కృత విశ్వ‌విద్యాల‌యం ఉప‌కుల‌ప‌తితో చ‌ర్చించాల‌న్నారు. తిరుమ‌ల అన్న‌మ‌య్య భ‌వ‌నంలో శుక్ర‌వారం టిటిడి ధార్మిక ప్రాజెక్టుల‌పై ఈవో అధికారుల‌తో స‌మీక్ష నిర్వ‌హించారు.

      ఈ సంద‌ర్భంగా ఈవో మాట్లాడుతూ డిజిటలైజేషన్ చేసిన అన్న‌మ‌య్య సంకీర్త‌న‌ల‌ను టిటిడి వెబ్‌సైట్‌లో ఉంచాల‌న్నారు. అన్న‌మ‌య్య సంకీర్త‌న‌ల‌కు విస్తృత ప్ర‌చారం క‌ల్పించేందుకు    "  అదివో...అల్ల‌దివో "  కార్య‌క్ర‌మాన్ని ప‌టిష్టంగా నిర్వ‌హించాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. . ఇప్ప‌టివ‌ర‌కు ల‌భ్య‌మైన 14 వేల అన్న‌మ‌య్య సంకీర్త‌న‌లకు అర్థ‌, తాత్ప‌ర్య విశేషాంశాల‌తో "  అన్న‌మ‌య్య సాహిత్య‌ లహ‌రి " పేరుతో భ‌క్తుల‌కు అందుబాటులోకి తీసుకురావాల‌ని చెప్పారు.

       అదే విధంగా దాస సాహిత్యంలోని 5 నుండి 10 వేల దాస సంకీర్త‌న‌ల‌ను సేక‌రించేందుకు కృషి చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. దాస సాహిత్య‌నికి విస్తృత ప్ర‌చారం క‌ల్పించేందుకు క‌ర్ణాట‌క‌లోని బెంగూళూరు విశ్వ‌విద్యాల‌యంతో ఒప్ప‌దం చేసుకోవాల‌ని సూచించారు. దాస సాహిత్య కీర్త‌న‌లు ప్ర‌చారం చేసేందుకు ఎస్వీబీసిలో ప్ర‌త్యేక టైం స్లాట్ కేటాయించాల‌న్నారు. ఎస్వీ రికార్డింగ్ ప్రాజెక్టు రికార్డు చేసిన 300 దాస సంకీర్త‌న‌ల‌తో "  దాస న‌మ‌నం "  పేరుతో క‌ర్ణాట‌క‌లో పాటల‌ పోటీలు నిర్వ‌హించాల‌ని ఈవో ఆదేశించారు. నాళాయిర దివ్యప్రబంధ ప్రాజెక్టు, ఆళ్వార్ దివ్య ప్ర‌బంధ ప్రాజెక్టు, ఎస్వీ రికార్డింగ్ ప్రాజెక్టుల‌పై కూడా జవహర్  రెడ్డి స‌మీక్షించారు.
     
టిటిడి ధర్మకర్తల మండలి స‌భ్య‌కార్య‌ద‌ర్శిగా..
           టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి స‌భ్య‌కార్య‌ద‌ర్శిగా డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి శుక్ర‌వారం తిరుమల శ్రీ‌వారి ఆలయంలో ప్రమాణ స్వీకారం చేశారు. అనంత‌రం ఆల‌యం వెలుప‌ల ఈవో మీడియాతో మాట్లాడారు. తిరుమల శ్రీవారి సాల‌క‌ట్ల బ్ర‌హ్మోత్స‌వాలు అక్టోబ‌రు 7 నుండి 15వ తేదీ వ‌ర‌కు నిర్వ‌హిస్తామ‌ని, ఇందుకోసం ఏర్పాట్లు జ‌రుగుతున్నాయ‌ని చెప్పారు. కోవిడ్ మార్గ‌ద‌ర్శ‌కాల మేర‌కు ఈ బ్ర‌హ్మోత్స‌వాల‌ను ఏకాంతంగా నిర్వ‌హిస్తామ‌న్నారు. రాష్ట్ర ముఖ్య‌మంత్రి శ్రీ వైఎస్‌.జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిని బ్ర‌హ్మోత్స‌వాల‌కు ఆహ్వానిస్తామ‌న్నారు. ఇదివ‌ర‌కు ప్ర‌క‌టించిన‌ట్టుగానే అంజ‌నాద్రిలో హ‌నుమాన్ జ‌న్మ‌స్థ‌లాన్ని అభివృద్ధి చేస్తామ‌ని తెలిపారు..

 

మరింత సమాచారం తెలుసుకోండి: