
ఇక జిల్లాల వారీగా చూస్తే.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో బయట అడుగు పెట్టనివ్వకుండా ఏకధాటిగా వానపడింది. కాళేశ్వరం ప్రాజెక్టులోని గ్రావిటీ కెనాల్ ప్రాంతంలో ప్రయాణికులతో వెళ్తున్న బస్సు బురదలో కూరుకుపోయింది. జేసీబీ సాయంతో బస్సును బయటకు తీశారు. ప్రాణ నష్టం లేదు. మల్హర్ మండలం శాలపల్లి వద్ద గొర్రెల కాపరులు వరదల్లో చిక్కుకున్నారు. వారిని పోలీసులు కాపాడారు. మహబూబాబాద్ జిల్లాలోపాకాల, మున్నేరు, ఆకేరు, పాలేరు, వట్టి వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కుంభవృష్టి వర్షాలతో చెరువులు అలుగుపారుతున్నాయి. గోదావరి, మంజీర నదుల్లో ప్రవాహ ఉద్ధృతి అంతకంతకూ పెరుగుతోంది. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో రేకుల షెడ్డు కూలి ముగ్గురు గాయపడ్డారు. బీర్కూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం చుట్టూ వర్షపునీరు చేరింది. నసురుల్లబాద్ మండలం నమిలిలో ట్రాక్టర్ వరదనీటిలో మునిగిపోయింది.
నిజామాబాద్ సీతారామ్‌నగర్ కాలనీలో విద్యుదాఘాతానికి ఆవులు మరణించాయి. జగిత్యాల జిల్లాలోని 63వ నంబర్ జాతీయ రహదారి మీదుగా ప్రవాహం పెరిగింది. పెద్దపల్లి, జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో ఇందిరా ప్రియదర్శిని కాలనీలో పాత ఇల్లు కూలింది. ఉమ్మడి ఆదిలాబాద్‌లోని ఏజెన్సీ ప్రాంతాల్లో వాగులు, ఒర్రెలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. చాలా ప్రాంతాలకు బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. మంచిర్యాల జిల్లా గద్వాల రాంనగర్, బురద పేట కాలనీల్లో రెండు మట్టి మిద్దెల ఇళ్ళు కూలిపోయాయి. హైదరాబాద్‌లోని చాలా ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురుస్తోంది.