అమరావతి: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి కొత్త తలనొప్పి మొదలైంది. ఇటీవల ఓ ప్రముఖ చానల్‌లో వైఎస్ జగన్ చెల్లెలు షర్మిల కొత్త పార్టీ పెట్టబోతున్నారంటూ టెలికాస్ట్ అయింది. అంతే.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఆ తర్వాత ఈ వార్త ఒక్కసారిగా వైరల్ అయిపోయింది. వైఎస్ షర్మిల కొత్త పార్టీని తెలంగాణలో పెట్టనున్నట్టు, ఆ పార్టీ పేరు కూడా తెలంగాణ వైఎస్సార్ కాంగ్రెస్ అని ఫిక్స్ చేసినట్టు కూడా ఆ టెలికాస్ట్‌లో చెప్పుకొచ్చారు. గత కొంత కాలంగా షర్మిలకు, జగన్‌కు మధ్య సంబంధాలు తెగిపోయాయని, ఈ నేపథ్యంలోనే షర్మిల కనీసం క్రిస్ట్ మస్ వేడుకలకు కూడా జగన్ ఇంటికి రాలేదని తెలిపారు. అన్నా చెల్లెల్ల మధ్య బంధం తెగిపోయిందని, షర్మిల సొంత కుంపటి పెట్టుకోబోతోందంటూ వందల వార్తలు వస్తూనే ఉన్నాయి.

దీనిపై అటు తెలంగాణ నేతలు, ఇటు ఏపీ నేతలు ఎప్పటి కప్పుడు స్పందిస్తూనే ఉన్నారు. షర్మిల పార్టీ పెట్టుకుంటే ఏపీలో పెట్టుకోవాలి కాని తెలంగాణలో ఎందుకంటూ కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ విమర్శలు కూడా చేశారు. షర్మిల ప్రభావం తెలంగాణలో ఏ మాత్రం ఉండబోదని, వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభిమానులు కాంగ్రెస్ పార్టీకే ఓటు వేస్తారు తప్ప షర్మిలకు వేయరంటూ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కూడా అన్నారు. ఇక మరోపక్క ఏపీలో అయితే ప్రతిపక్ష టీడీపీ నేతలు ఒకరి తరువాత మరొకరు జగన్‌పై విమర్శలు చేస్తూనే ఉన్నారు.

తాజాగా మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు తన సోషల్ మీడియా ఖాతాలో సంచలన పోస్ట్ పెట్టారు. ఈ పోస్ట్‌లో ఆయన వైసీపీ ఎంపీ విజయ సాయి రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆయన పోస్ట్‌లో ఏం రాసుకొచ్చారంటే.. ‘బాబాయ్ హత్య కేసు తేల్చమంటూ ఓ వైపు నుంచి ఒక చెల్లి అడుగుతోందని, సైకో వేషాలు భరించలేక ఇంకో చెల్లి కొత్త పార్టీ పెడుతోందని అయ్యన్న పేర్కొన్నారు. ఈ విధంగా రెండు వైపుల నుంచి జగ్గడు నలిగిపోతున్నాడు. ఇందులో నీ స్కెచ్ ఏమీ లేదు కదా విజయ సాయి రెడ్డి?’ అంటూ ఎంపీ విజయసాయిరెడ్డిని అయన్న పాత్రుడు సూటిగా ప్రశ్నించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: