
అయితే, ప్రస్తుతం ఐదు రాష్ట్రాల ఎన్నికల వేళ యూపీ అసెంబ్లీ ఎన్నికలు బీజేపీకి కీలకంగా మారనున్నాయి. బీజేపీ రాజకీయాల కోసమో లేదో రామమందిర నిర్మాణం కోసమో తెలియదు కానీ `జైశ్రీరామ్` అనే నినాదంతో అనేక ఎన్నికల్లో విజయం సాధించింది. అయితే, ప్రస్తుత యూపి ఎన్నికల వేళ కాషాయ పార్టీ జై పరశురామ్ అని నినదిస్తోంది. దీనికి ప్రధాన కారణం ఉత్తర ప్రదేశ్లో 12 శాతం దాకా బ్రాహ్మణులు ఉండడమే. కొన్ని నియోజకవర్గాల్లో 20 శాతం మేర బ్రాహ్మణులు ఉన్నారు.
గత ఎలక్షన్స్ లో బ్రాహ్మణులంతా కాషాయ పార్టీకి మద్ధతు ఇవ్వడంతో భారీ మెజారిటీని సాధించి అధికారాన్ని చేపట్టింది. అయితే, ఈసారి మాత్రం సమాజ్వాది పార్టీ వైపు బ్రాహ్మణులు మొగ్గు చూపారు. ఈ క్రమంలో బీజేపీ జైపరశురామ్ నినాదాన్ని తెరమీదకు తీసుకువచ్చింది. పరశురాముడు బ్రాహ్మణుడు ఆయనకు గుడులు తక్కువ ఉండడంతో బీజేపీ బ్రాహ్మణులను తమ వైపు తిప్పుకోవడానికి 12 అడుగుల పొడవైన పరశురాముడి విగ్రహాన్ని ప్రతిష్టించింది.
దీంతో పాటు పరశురాముడి ప్రాశస్థ్యాన్ని మరింతగా జనాల్లోకి తీసుకెళ్తామని చెబుతున్న కమలనాథులు.. పరశురాముడికి గుడులు కట్టిస్తామని హామీలు ఇస్తున్నారు. అయితే, ఈ మాటలపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. అధికారంలో ఉన్నపుడు కనీసం బ్రాహ్మణులను పట్టించుకోలేదు కానీ, ఎన్నికల వేళ ఇప్పుడు జై పరశురామ్ అంటే ఎవరు ఓటెయ్యరని ఎస్పీ నేతలు అంటున్నారు. అయితే, ఈ నినాదం పెద్ద ఎత్తున ప్రభావం చూపలేకపోయినా ఎంతో కొంత ఓటు బ్యాంకును రాబడుతుందని బీజేపీ నేతలు భావిస్తున్నారు.